source: X
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ రెండో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడి, బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన ఆ జట్టు.. ఇవాళ వెస్టిండీస్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 16.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. అయితే స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ బౌలర్లు విజయవంతంగా కాపాడుకున్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ 18.1 ఓవర్లలో 83 పరుగులకే చాపచుట్టేసింది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో డి ఆర్కీ షార్ట్ (34) టాప్ స్కోరర్‌గా కాగా.. జోనాథన్ వెల్స్ (26), బెన్ డంక్ (13), బెన్ లాగ్లిన్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. విండీస్ బౌలర్లలో కాట్రెల్ 3, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రీఫర్ చెరో 2, ఎమ్రిట్, డ్వేన్ బ్రావో, డేవ్ మొహమ్మద్ తలో వికెట్ తీశారు.
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ బౌలర్లు చెలరేగిపోయారు. బెన్ హిల్ఫెన్హాస్, ఫవాద్ అహ్మద్ చెరో 3, షార్ట్ 2, బీర్, కౌల్టర్ నైల్ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కార్లోస్ బ్రాత్‌వైట్ (25) టాప్ స్కోరర్ కాగా.. లెండిల్ సిమన్స్ (17), బ్లాక్‌వుడ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ డకౌటయ్యాడు.
ఇదీ చదవండి: ఊతప్ప మెరుపులు వృథా.. సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి


