World Athletics Championships: ‘టాప్‌’ లేపిన అమెరికా

World Athletics Championships: USA wins 33 medals - Sakshi

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం

33 పతకాలు నెగ్గిన ఆతిథ్య దేశం

చివరి రోజు రెండు ప్రపంచ రికార్డులు

యుజీన్‌ (అమెరికా): తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఆతిథ్యమిచ్చిన అమెరికా చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో అమెరికా 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. ఒకే చాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన జట్టుగా అమెరికా రికార్డు నెలకొల్పింది.

1987లో తూర్పు జర్మనీ అత్యధికంగా 31 పతకాలు సాధించింది. పోటీల చివరిరోజు రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. పురుషుల పోల్‌వాల్ట్‌ ఈవెంట్‌లో అర్మాండ్‌ డుప్లాంటిస్‌ (స్వీడన్‌)... మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో టోబీ అముసాన్‌ (నైజీరియా) కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. ప్రపంచ రికార్డులు సృష్టించినందుకు డుప్లాంటిస్, టోబీ అముసాన్‌లకు లక్ష డాలర్ల చొప్పున (రూ. 79 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.  

ఆఖరి రోజు ఎనిమిది విభాగాల్లో ఫైనల్స్‌ జరిగాయి. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో తలీతా డిగ్స్, అబీ స్టెనర్, బ్రిటన్‌ విల్సన్, సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌లతో కూడిన అమెరికా జట్టు 3ని:17.79 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించింది.  పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలోనూ అమెరికాకే స్వర్ణం లభించింది. పురుషుల పోల్‌వాల్ట్‌ ఫైనల్లో డుప్లాంటిస్‌ 6.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

6.20 మీటర్లతో తన పేరిటే ఉన్న రికార్డును డుప్లాంటిస్‌ సవరించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ సెమీఫైనల్లో టోబీ అముసాన్‌ 12.12 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు లిఖించింది. ఫైనల్‌ రేసును టోబీ 12.06 సెకన్లలోనే ముగించి మరోసారి ప్రపంచ రికార్డు సాధించి, బంగారు పతకం గెలిచినా... రేసు జరిగిన సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె రికార్డును గుర్తించలేదు.

స్వర్ణంతో ఫెలిక్స్‌ రిటైర్‌...
అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్‌ అలీసన్‌ ఫెలిక్స్‌ తన కెరీర్‌ను స్వర్ణ పతకంతో ముగించింది. 36 ఏళ్ల అలీసన్‌ ఫెలిక్స్‌ 4్ఠ400 మీటర్ల ఫైనల్లో స్వర్ణం నెగ్గిన అమెరికా రిలే జట్టులో పోటీపడలేదు. అయితే ఆమె హీట్స్‌లో బరిలోకి దిగడంతో ఫెలిక్స్‌కు కూడా పసిడి పతకాన్ని ఇచ్చారు. అంతకుముందు ఆమె 4్ఠ400 మిక్స్‌డ్‌ రిలేలో కాంస్య పతకం సాధించింది. ఓవరాల్‌గా పది ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న ఫెలిక్స్‌ మొత్తం 20 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) సాధించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top