WI Vs ENG T20: రీఎంట్రీలో రసెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. ఇంగ్లండ్‌పై విండీస్‌ విజయం

WI Vs Eng 1st T20I: Recalled Andre Russell Hurt England West Indies Win - Sakshi

West Indies vs England, 1st T20I: వెస్టిండీస్‌ క్రికెటర్‌ ఆండ్రీ రసెల్‌ జాతీయ జట్టులో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బంతితో చెలరేగిన ఈ ఆల్‌రౌండర్‌.. అనంతరం లక్ష్య ఛేదనలో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.

ఇంగ్లండ్‌ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచి రీఎంట్రీ అదుర్స్‌ అనిపించాడు. కాగా మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లింది.

మూడు వికెట్లు పడగొట్టిన రసెల్‌
ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి ఇంగ్లిష్‌ జట్టుకు షాకిచ్చిన వెస్టిండీస్‌.. టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించి సత్తా చాటింది. బార్బడోస్‌ వేదికగా బుధవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ 20 బంతుల్లో 40, జోస్‌ బట్లర్‌ 31 బంతుల్లో 39 పరుగులతో శుభారంభం అందించగా.. మిగతా వాళ్లలో లియామ్‌ లివింగ్‌ స్టోన్‌(27) ఒక్కడే ఇరవై పరుగుల పైచిలుకు స్కోరు రాబట్టాడు.

కరేబియన్‌ బౌలర్ల ధాటికి మిగిలిన ఇంగ్లిష్‌ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఇక ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో పేస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌, మరో ఫాస్ట్‌బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మిగిలిన వాళ్లలో పేసర్లు జేసన్‌ హోల్డర్‌ ఒకటి, రొమారియో షెఫర్డ్‌ రెండు వికెట్లు కూల్చారు. ఇక స్పిన్నర్‌ అకీల్‌ హొసేన్‌కు ఒక వికెట్‌ దక్కింది.

పావెల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. 
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌(22), కైలీ మేయర్స్‌(35) మంచి ఆరంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ షాయీ హోప్‌ 36 పరుగులతో రాణించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన నికోలస్‌ పూరన్‌ 13, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ ఒక్క పరుగుకే పరిమితమయ్యారు.

అయితే, ఆరో నంబర్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌, ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆండ్రీ రసెల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. పావెల్‌ 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 206.67 స్ట్రైక్‌రేటుతో 31 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. 

సునామీ ఇన్నింగ్స్‌తో రసెల్‌ విధ్వంసం
మరోవైపు రసెల్‌ కూడా 14 బంతులు ఎదుర్కొని 207కు పైగా స్ట్రైక్‌రేటుతో 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా రసెల్‌ దాదాపు రెండేళ్ల తర్వాత వెస్టిండీస్‌ తరఫున బరిలోకి దిగడం ఇదే తొలిసారి. 

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో జోస్‌ బట్లర్‌ బృందానికి మరోసారి నిరాశే మిగిలింది. ఇరు జట్ల మధ్య గురువారం రెండో టీ20 జరుగనుంది.

చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top