IND VS AUS 1st Test: కేఎల్‌ రాహుల్‌ను ఆడించకండి.. వైస్‌ కెప్టెన్‌ అయితేనేం..?

Why Cant KL Rahul Be Dropped, There Is No Rule That VC Can Be Dropped - Sakshi

Kapil Dev Comments On KL Rahul: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023 నేపథ్యంలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ సంచలన కామెంట్స్‌ చేశాడు. తొలి టెస్ట్‌ కోసం భారత తుది జట్టు కూర్పు విషయంపై కపిల్‌ మాట్లాడుతూ.. టీమ్‌ కాంబినేషన్‌లో రాహుల్‌ సెట్‌ కాకపోతే, తుది జట్టులో ఆడించకండి అంటూ కెప్టెన్‌, కోచ్‌లకు సలహా ఇచ్చాడు. వైస్‌ కెప్టెన్‌ అయినంత మాత్రనా తుది జట్టులో ఆడించాలా అని ప్రశ్నించాడు. గతంలో చాలా సందర్భాల్లో వైస్‌ కెప్టెన్లను ఆడించలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు.

జట్టు కాంబినేషన్‌లో సెట్‌ కాకపోతే కెప్టెన్‌ను కూడా తప్పించవచ్చని అన్నాడు. కెప్టెన్‌ను కానీ వైస్‌ కెప్టెన్‌ను కానీ తప్పక ఆడించాలన్న రూల్‌ ఏమీ లేదని తెలిపాడు. కేఎల్‌ రాహుల్‌ను తప్పక తుది జట్టులో ఆడించాలనుకుంటే వికెట్‌కీపింగ్‌ చేయించమని అన్నాడు. గతంలో చాలా మ్యాచ్‌ల్లో రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

రాహుల్‌తో వికెట్‌కీపింగ్‌ చేయిస్తే, ఎక్స్‌ట్రా ప్లేయర్‌ను తీసుకునే వెసులుబాటు ఉంటుందని వివరించాడు. వ్యక్తిగతంగా తనకు రాహుల్‌పై ఎలాంటి ద్వేషం లేదని, తాను ఏది చెప్పినా జట్టు ప్రయోజనాల కోసమేనని తెలిపాడు. వాస్తవానికి రాహుల్‌ ఆటతీరు తనకు బాగా నచ్చుతుందని, జట్టు సమతూకం కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

కాగా, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా రేపటి (ఫిబ్రవరి 9) నుంచి ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ నేపథ్యంలోనే కపిల్‌.. రాహుల్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇదే సందర్భంగా కపిల్‌.. ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్‌ పంత్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ పూర్తిగా కోలుకున్న తర్వాత అతని చెంప పగలగొట్టాలని ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ గాయపడటంతో టీమిండియా లయ తప్పిందని, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాని కపిల్‌ చెప్పుకొచ్చాడు. 

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్  

సిరీస్‌ షెడ్యూల్‌..

  • ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్‌, నాగ్‌పూర్‌
  • ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్‌, ఢిల్లీ
  • మార్చి 1-5 వరకు మూడో టెస్ట్‌, ధర్మశాల
  • మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్‌, అహ్మదాబాద్‌

వన్డే సిరీస్‌..

  • మార్చి 17న తొలి వన్డే, ముంబై
  • మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం
  • మార్చి 22న మూడో వన్డే, చెన్నై 

  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top