‘నా విలువను నిరూపించుకునే స్థితిలో లేను’ | virat kohli comments on 2027 odi world cup retirement controversy | Sakshi
Sakshi News home page

‘నా విలువను నిరూపించుకునే స్థితిలో లేను’

May 16 2026 3:49 AM | Updated on May 16 2026 6:10 AM

virat kohli comments on 2027 odi world cup retirement controversy

అలా అయితే ఆడకుండా తప్పుకుంటా

2027 వన్డే వరల్డ్ కప్‌పై కోహ్లి వ్యాఖ్య

న్యూఢిల్లీ: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ఒక్క వన్డే ఫార్మాట్‌లోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల పదేపదే 2027 వన్డే వరల్డ్ కప్‌లో అతని స్థానంపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కోహ్లి తన ఆలోచనలేమిటో స్పష్టంగా చెప్పాడు. తన స్థాయి, విలువకు తగిన గౌరవం ఇస్తేనే ఆటలో కొనసాగుతానని, లేదంటే తప్పుకుంటానని అతను వ్యాఖ్యానించాడు. తాను ఇంకా ఏదో నిరూపించుకోవాల్సిన స్థితిలో లేనని కోహ్లి స్పష్టం చేశాడు.

‘నన్ను ఇప్పటికి 2027 వరల్డ్ కప్‌లో ఆడటం గురించి చాలాసార్లు అడిగారు. నేను ఎప్పుడైనా ఆడేందుకు సిద్ధం. ఎందుకంటే అది నాకు నిత్యకృత్యం. నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఇల్లు వదిలి నా కిట్‌తో బయటకు వెళ్లడం, ఎంతో కష్టపడటం కూడా దాని కోసమే కదా. భారత్‌ తరఫున మరో ప్రపంచకప్ ఆడటం గొప్ప గౌరవం. కానీ నాకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. జట్టుకు నా అవసరం ఉందని భావిస్తేనే ఆడతాను. అంతే కానీ నా విలువను, స్థాయిని నిరూపించుకుంటే ఆడాల్సిన పరిస్థితి వస్తే అందుకు సిద్ధంగా లేను. నన్ను నేను నిరూపించుకోవాల్సిన స్థితిలో ఇప్పుడు లేను’ అని కోహ్లి వెల్లడించాడు.

గత ఏడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. సిరీస్‌కు పూర్తిగా సన్నద్ధమై, ప్రత్యేకంగా సొంత ప్రాక్టీస్‌ సెషన్‌లలో పాల్గొని  బోర్డు నిబంధనల ప్రకారం రంజీ ట్రోఫీలో ఆడిన తర్వాత కూడా అతను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. కోహ్లిని తొలి రెండు టెస్టులకే ఎంపిక చేస్తామని, ఆ తర్వాత ప్రదర్శనను బట్టి కొనసాగిస్తామని సెలక్టర్లు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘మనం పని చేసే చోట మన ప్రతిభ, సామర్థ్యంపై నమ్మకం ఉందని చెప్పి బాధ్యతలు అప్పగించిన తర్వాత వారం రోజులకే మన పనితీరును ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. నేను నిజాయితీగా పని చేస్తాను. ఆట కోసం ఎంతైనా కష్టపడతాను. వన్డేలో 40 ఓవర్ల పాటు బౌండరీ లైన్ల మధ్య ఆ మూల నుంచి ఈ మూలకు పరుగెత్తమని చెబితే కచ్చితంగా చేస్తా. ప్రతీ బంతిని నా కెరీర్ చివరి బంతిలా భావించి మైదానంలో పోరాడతా. దీనిపై ఫిర్యాదు చేయను. ఎందుకంటే దానికి అనుగుణంగానే నేను సాధన చేస్తా, సిద్ధమవుతా. కేవలం ఫలితాలు చూసి నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే వాటి గురించి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ముందే చెప్పేయండి. లేదా ఒకసారి అవకాశం ఇచ్చాక నన్ను పని చేసుకోనివ్వండి’ అని విరాట్ తన ఉద్దేశాన్ని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement