
లాహోర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి శతక దాహం త్వరలో ప్రారంభంకానున్న ఇంగ్లండ్ పర్యటనలో తీరుతుందని పాక్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్ జోస్యం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి శతకొట్టక దాదాపు రెండేళ్లు అయ్యిందని, అతని కెరీర్ మొత్తంలో సెంచరీకి ఇంత గ్యాప్ రావడం ఇదే తొలిసారని వెల్లడించాడు. 2019 నవంబర్‌లో చివరిసారి బంగ్లాదేశ్‌పై పింక్ బాల్ టెస్ట్‌లో శతకం సాధించిన కోహ్లి.. రెండేళ్ల కాలంలో చాలాసార్లు సెంచరీకి చేరువయ్యాడు కానీ, సెంచరీని మాత్రం చేయలేకపోయాడని పేర్కొన్నాడు. అయితే, కోహ్లి కేవలం సెంచరీ మార్కును మాత్రమే చేరుకోలేకపోయాడని, అతని పరుగుల ప్రవాహానికి ఏమాత్రం అడ్డుకట్ట పడలేదని గుర్తుచేశాడు.
న్యూజిలాండ్‌తో జరుగబోయే డబ్యూటీసీ ఫైనల్లోనే కోహ్లి సెంచరీ సాధిస్తాడని, దీంతో అతనితో పాటు అభిమానుల నిరీక్షణకు కూడా తెరపడనుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 70 శతకాలు నమోదు చేసిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అతను రానున్న ఇంగ్లండ్ పర్యటనలో మరో సెంచరీ చేస్తే రెండో స్థానంలో ఉన్న పాంటింగ్(71) సరసన చేరతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో శతక శతకాలతో సచిన్(100) అగ్రస్థానంలో నిలిచాడు.
చదవండి: సచిన్ 'దేవుడు', ధోని 'లెజెండ్', కోహ్లి..?