వైభవ్‌కు తోడుగా తల్లిదండ్రులు | Vaibhav parents accompany him on the Ireland and England tour | Sakshi
Sakshi News home page

వైభవ్‌కు తోడుగా తల్లిదండ్రులు

Jun 19 2026 3:16 AM | Updated on Jun 19 2026 3:16 AM

Vaibhav parents accompany him on the Ireland and England tour

ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌కు పంపాలని బీసీసీఐ నిర్ణయం

న్యూఢిల్లీ: భారత సీనియర్‌ జట్టులోకి తొలిసారి ఎంపికైన సంచలన బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాటు చేయనుంది. ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే 15 ఏళ్ల వైభవ్‌కు తోడుగా అతని తల్లిదండ్రులను పంపాలని బోర్డు నిర్ణయించింది. ఈ వయసులో అమ్మానాన్న తన పక్కన ఉండటం వైభవ్‌కు మేలు చేస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా అభిప్రాయ పడ్డారు. తనకంటే వయసులో పెద్దవారైన క్రికెటర్లతో కలిసి ఉండటంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సైకియా వెల్లడించారు. 

‘సాధారణంగా ఏదైనా సీనియర్‌ టీమ్‌లలో ఇంత చిన్న వయసు ఆటగాళ్లు ఉండరు. ఎప్పుడో సచిన్‌ టెండూల్కర్‌ చిన్న వయసులో జాతీయ జట్టులోకి వచ్చాక ఇన్నేళ్లకు ఇప్పుడు మళ్లీ వైభవ్‌లాంటి కుర్రాడు వచ్చాడు. సహజంగానే 15 ఏళ్ల అబ్బాయికి సీనియర్లతో కలిసి ఉండటంలో సమస్యలు వస్తాయి. మిగతా ఆటగాళ్లంతా 18 ఏళ్లకు పైగా వయసు ఉన్నవారే. అలాంటి వాతావరణంలో అలవాటు పడేందుకు తల్లిదండ్రులు తోడుగా ఉండటం మేలు చేస్తుంది. స్కూల్‌ విద్యార్థులు విహారయాత్రకు వెళ్లినప్పుడు కూడా పెద్దవాళ్లు తోడుగా ఉంటారు. ఇదీ అలాంటిదే. వైభవ్‌ ఇంకా స్కూల్‌ కుర్రాడే. అతను రాబోయే కొన్నేళ్ల పాటు భారత క్రికెట్‌కు పెద్ద ఆస్తిలాంటివాడు’ అని సైకియా వ్యాఖ్యానించారు. 

మరోవైపు ఇటీవల శ్రీలంకలో ‘ఎ’ మ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌ ప్రత్యర్థి ఆటగాళ్లతో దూకుడుగా వ్యవహరించిన అంశంపై తాము ఎలాంటి చర్యలు తీసుకోమని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. ‘ఇదంతా ఆటలో భాగంగానే జరిగింది. ఇలాంటి అంశాల్లో మ్యాచ్‌ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఏం చేయాలనేది వారిష్టం. బీసీసీఐకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. మేం మ్యాచ్‌ రిఫరీ పాత్ర పోషించలేం కదా’ అని సైకియా స్పందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement