US Open 2022: అటు అన్స్‌...ఇటు ఇగా

US Open 2022: Iga Swiatek vs Ons Jabeur Enter Womens Singles Finals on 10 sept 2022 - Sakshi

మహిళల సింగిల్స్‌ తుది పోరుకు జబర్, స్వియాటెక్‌

సెమీస్‌లో గార్సియా, సబలెంకా చిత్తు

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ  

న్యూయార్క్‌: ఈ సీజన్‌ ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో కొత్త విజేతను చూడొచ్చు. ప్రపంచ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలండ్‌), ఐదో సీడ్‌ అన్స్‌ జబర్‌ (ట్యునీషియా) తొలిసారిగా యూఎస్‌ ఓపెన్‌లో టైటిల్‌ పోరుకు అర్హత సంపాదించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో వరల్డ్‌ నంబర్‌వన్‌ స్వియాటెక్‌ 3–6, 6–1, 6–4తో ఆరోసీడ్‌ అరియానా సబలెంక (బెలారస్‌)పై గెలుపొందగా, జబర్‌ 6–1, 6–3తో 17వ సీడ్‌ కరొలిన్‌ గార్సియా (ఫ్రాన్స్‌)ను ఓడించింది.

శనివారం రాత్రి జరిగే ఫైనల్లో స్వియాటెక్‌తో జబర్‌ తలపడుతుంది. స్వియాటెక్‌కు యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ కొత్త కానీ... ఆమె ఖాతాలో రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లున్నాయి. 2020, 2022లలో ఈ పోలండ్‌ స్టార్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలుచుకుంది. మరో వైపు జబర్‌ ఈ సీజన్‌లో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌ చేరింది. వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన ట్యునీషియా అమ్మాయి ఈ సారి ‘గ్రాండ్‌’ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.  

శ్రమించిన టాప్‌సీడ్‌...
తొలి సెమీ ఫైనల్లో టాప్‌సీడ్‌ స్వియాటెక్‌కు ప్రత్యర్థి సబలెంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొదటి సెట్‌లో రెండుసార్లు సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సబలెంక అదే ఉత్సాహంతో సుదీర్ఘంగా జరిగిన ఐదో గేమ్‌ను గెలుచుకుంది. 8, 9 గేమ్‌లను చకచకా ముగించి తొలిసెట్‌ను వశం చేసుకుంది. తర్వాత రెండో సెట్‌లో  స్వియాటెక్‌ పుంజుకోవడంతో సబలెంక చేతులెత్తేసింది. వరుస రెండు గేముల్ని అవలీలగా గెలుచుకున్న స్వియాటెక్‌కు మూడో గేమ్‌లో పోటీ ఎదురైంది.

ఆ గేమ్‌ సబలెంక గెలిచినా... తదుపరి మూడు గేముల్లో తన రాకెట్‌ పదునేంటో చూపించిన స్వియాటెక్‌ 6–1తో సెట్‌ నెగ్గింది. నిర్ణాయక మూడో సెట్లో ఆరంభంలో దూకుడుగా ఆడిన సబలెంక 2–0తో ముందంజలో నిలిచింది. ఈ దశలో మూడు, నాలుగు గేముల్లో ఏస్‌లు, విన్నర్లు కొట్టిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ 2–2తో సమం చేసింది. ఆ తర్వాత రెండు గేముల్ని పట్టుదలగా ఆడిన బెలారస్‌ స్టార్‌ 4–2తో ఒత్తిడి పెంచింది. ఈ దశలో నంబర్‌వన్‌ తన అసలైన ప్రదర్శనతో వరుసగా నాలుగు గేములు గెలిచింది.

2 ఏస్‌లు సంధించిన స్వియాటెక్‌ 3 డబుల్‌ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేయగా, సబలెంక 4 ఏస్‌లు కొట్టి ఏడుసార్లు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. 44 అనవసర తప్పిదాలు చేసింది. రెండో సెమీఫైనల్లో ఐదో సీడ్‌ జబర్‌ అలవోకగా ప్రత్యర్థి ఆటకట్టించింది. 8 ఏస్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని జబర్‌ వరుస సెట్లలో కేవలం 66 నిమిషాల్లోనే సెమీస్‌ మ్యాచ్‌ను ఏకపక్షంగా 21 విన్నర్లు కొట్టిన జబర్‌ 15 అనవసర తప్పిదాలు చేయగా, రెండు ఏస్‌లు సంధించిన గార్సియా, 23 అనవసర తప్పిదాలు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top