Tokyo Olympics: నాలుగులోనూ వెలుగు

Tokyo Olympics: Indian womens hockey team loses 3-4 to Great Britain - Sakshi

కాంస్య పతక మ్యాచ్‌లో పోరాడి ఓడిన భారత మహిళల జట్టు

నాలుగో స్థానంలో నిలిచిన రాణి రాంపాల్‌ బృందం

4–3తో గెలిచి కాంస్యం దక్కించుకున్న బ్రిటన్‌

విశ్వ క్రీడల్లో వరుస పరాజయాలతో మొదలైన భారత మహిళల హాకీ జట్టు ఆట జేజేలతో ముగిసింది. అలా అని మన హాకీ జట్టేమీ పతకం గెలవలేదు. కానీ చరిత్ర సృష్టించింది... ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్‌ బరిలో నిలిచి! మనసుల్ని గెలిచింది.... కాంస్యం కోసం పోరాడి! ఇక్కడా మళ్లీ భారత్‌ ఓడి ఉండవచ్చు. కానీ మరీ బాధపడాల్సిన పరాజయమైతే కాదు... పరాభవం అంతకన్నా కాదు... త్రుటిలో చేజారిన విజయం. పతకం రాకున్నా వేనోళ్లా ప్రశంసలు వస్తున్నాయన్నది నిజం... అడుగడుగునా అమ్మాయిల పోరాటం అద్వితీయం. అందుకే జాతి యావత్తు జేజేలు పలుకుతోంది. ఒలింపిక్స్‌లో మూడో ప్రయత్నంలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానం సంపాదించిన భారత మహిళల జట్టు ప్రదర్శన కాంస్య పతకంలాంటిదేనని దేశం గర్వపడుతోంది.   

టోక్యో: చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు పోరాటం చివరికి నిరాశగా ముగిసింది. కానీ బంగారంలాంటి ప్రదర్శనతో కోట్ల మంది మనసుల్ని గెలిచింది. కాంస్యం చేజారిందనే బాధ ఉంది. అయితే కాంస్యం కూడా ‘వీరి మెడలో ఎందుకు పడలేదు’ అనుకునేలా మన జట్టు పోరాడింది. మూడో స్థానం కోసం శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు 3–4తో బ్రిటన్‌ చేతిలో పోరాడి ఓడింది. భారత్‌ తరఫున గుర్జీత్‌ సింగ్‌ (25వ, 26వ ని.లో) రెండు గోల్స్, వందన కటారియా (29వ ని.లో) ఒక గోల్‌ చేశారు. బ్రిటన్‌ జట్టుకు ఎలీనా (18వ ని.లో), సారా రాబర్ట్‌సన్‌ (24వ ని.లో), వెబ్‌ హోలీ పెర్న్‌ (35వ ని.లో), గ్రేస్‌ బాల్స్‌డన్‌ (48వ ని.లో) ఒక్కో గోల్‌ అందించారు.  

మనదే ఆధిపత్యం...
తొలి క్వార్టర్‌లో బ్రిటన్‌ గోల్‌ కోసం చేసిన ప్రయత్నాలన్నీ భారత మహిళలు గట్టిగా బదులు చెప్పడంతో నిష్ఫలమయ్యాయి. ప్రత్యర్థి దాడుల్ని భారత డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. అక్కడి నుంచి గోల్‌పోస్ట్‌ను సమీపిస్తే సవిత ఊరుకోలేదు. రెండు పెనాల్టీ కార్నర్లను, మరో రెండు ఫీల్డ్‌ గోల్స్‌ను సవిత చాకచక్యంగా ఆపేసింది. దీం తో గోల్‌ లేకుండా ఈ క్వార్టర్‌ ముగిసింది. ఎట్టకేలకు రెండో క్వార్టర్‌లో బ్రిటన్‌ ప్లేయర్లు ఎలీనా రేయ ర్, సారా రాబర్ట్‌సన్‌ లక్ష్యాలు ఫలించాయి. కానీ ఈ ఆనందం మరో ఐదు నిమిషాలకే ఆవిరైంది. ఈ క్వార్టర్‌తో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్‌ 3– 2తో పైచేయి సాధించింది. అది కూడా 5 నిమిషాల వ్యవధిలోనే భారత్‌ మూడు గోల్స్‌ సాధించింది.  

కలిసిరాని మూడో క్వార్టర్‌
అయితే మూడో క్వార్టర్లో హోలీ పియర్న్‌ వెబ్‌ గోల్‌ చేయడంతో స్కోరు 3–3 వద్ద సమమైంది. ఈ క్వార్టర్లో మనకు లభించిన 3 పెనాల్టీ కార్నర్లను గుర్జీత్‌ (రెండుసార్లు), దీప్‌ ఎక్కా గ్రేస్‌ గోల్‌గా మలచలేకపోవడం భారత్‌కు ప్రతికూలించింది. చివరి క్వార్టర్‌లో బ్రిటన్‌ పకడ్బందీగా కదంతొక్కడం... ఇదే సమయంలో ఉదిత ఎల్లో కార్డుతో, షర్మిలా గ్రీన్‌ కార్డ్‌తో కాసేపు ఆటకు దూరమవడం బ్రిటన్‌ పనిని సులువు చేసింది. 48వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను గ్రేస్‌ బాల్స్‌డన్‌ గోల్‌పోస్ట్‌పై గురిపెట్టడంతో భారత్‌ 3–4తో వెనుకబడింది. ఆ తర్వాత తుదికంటా అమ్మాయిలు పోరాడినా భారత్‌కు ఫలితం దక్కలేదు.

రూ. అర కోటి నజరానా...
కాంస్య పతక పోరులో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు భారీ నజరానాలే అందనున్నాయి. ఈ జట్టులో హరియాణాకు చెందిన 9 మంది క్రీడాకారిణులకు రూ. 50 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేస్తామని ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ కూడా తమ ప్లేయర్లు సలిమా టేటే, నిక్కీ ప్రధాన్‌లకు రూ. 50 లక్షల నగదు పురస్కారం ఇస్తామని సీఎం వెల్లడించారు.  

ఇక చాలు...నే వెళ్తా  
కోచ్‌ జోర్డ్‌ మరీన్‌ రాజీనామా
భారత మహిళల జట్టు చీఫ్‌ కోచ్‌ జోర్డ్‌ మరీన్‌ మ్యాచ్‌ ముగిసిన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. ‘కొనసాగే ఆలోచనలేవీ లేదు. ఇదే నా ఆఖరి మ్యాచ్‌. ఈ జట్టుతో నా ప్రయాణం సంతృప్తికరంగానే సాగింది. మూడున్నరేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న నేను ఇప్పుడు పూర్తిగా కుటుంబానికే అంకితమవ్వాలనుకుంటున్నాను’ అని వర్చువల్‌ మీడియా సమావేశంలో తెలిపారు. పొడిగింపు ఇస్తామన్నా కోచ్‌ నిరాకరించినట్లు తెలిసింది.   

మీరెవరూ ఏడవొద్దు
ఫోన్‌లో ఓదార్చిన ప్రధాని మోదీ
కాంస్యం చేజార్చుకున్న మహిళల హాకీ జట్టు పోరాటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఫోన్‌లో భారత జట్టు సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బాధను జీర్ణించుకోలేక విలపిస్తున్న అమ్మాయిల్ని వారించారు. ఏడిచే పని చేయలేదని జాతి యావత్‌ గర్వపడే పోరాటం చేశారని ప్రశంసించారు. ‘మీరంతా బాగా ఆడారు. మీ కృషికి పతకం దక్కలేదేమో కానీ కోట్ల మంది చిన్నారులకు మీ నుంచి ఎంతో ప్రేరణ దక్కింది. కోచ్, జట్టు సభ్యులందరికీ అభినందనలు’ అని ఫోన్‌లో మాట్లాడుతుండగానే అమ్మాయిలు ఏడ్చారు. ఇది గమనించిన ప్రధాని ‘ప్లీజ్‌ మీరెవరూ ఏడవొద్దు. మొత్తం దేశం మీ ప్రదర్శన పట్ల గర్విస్తోంది. మీ వల్లే మన జాతీయ క్రీడకు మళ్లీ పునరుత్తేజం
వచ్చింది’ అని అన్నారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top