టోక్యోలో భారతీయం: ప్రాక్టీస్‌ ప్రారంభించిన మన క్రీడాకారులు

Tokyo Olympics Indian Athletes Start Practice - Sakshi

టోక్యో: ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో అత్యుత్తమ ప్రదర్శనతో కొత్త చరిత్ర సృష్టించాలనే ఏౖకైక లక్ష్యంతో భారత అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్రీడల వేదికకు చేరుకున్న ఒకరోజు తర్వాత భారత తొలి బృందం సోమవారం పూర్తి స్థాయి ప్రాక్టీస్‌లో పాల్గొంది. అన్ని క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు సాధనలో చెమటోడ్చారు. కరోనా కేసుల కారణంగా భారత్‌ నుంచి వచ్చే ఆటగాళ్లకు మూడు రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌ అంటూ గతంలో ప్రకటించిన ఒలింపిక్‌ కమిటీ తర్వాత ఆ ఆంక్షలను తప్పించడంతో మొదటి రోజే నేరుగా మైదానంలోకి దిగే అవకాశం మన క్రీడాకారులకు కలిగింది.

ఆర్చరీ జంట దీపిక కుమారి, అతాను దాస్‌ స్థానిక యుమెనొషిమా పార్క్‌లో తమ బాణాలకు పదును పెట్టగా... తొలి ఒలింపిక్‌ పతకాన్ని ఆశిస్తున్న టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాళ్లు శరత్‌ కమల్, సత్యన్‌ సుదీర్ఘ సమయం పాటు సాధన చేశారు. జిమ్నాస్టిక్స్‌లో ఆశలు రేపుతున్న ప్రణతి నాయక్‌ తన కోచ్‌ మనోహర్‌ శర్మ పర్యవేక్షణలో ప్రాక్టీస్‌ చేసింది.

బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కూడా తమ జట్టు కోచ్‌లతో కలిసి కోర్టులోకి దిగారు. భారత సింగిల్స్, డబుల్స్‌ కోచ్‌లు పార్క్‌ సంగ్, మథియాస్‌ బో సాధనలో పీవీ సింధు, సాయిప్రణీత్, సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టిలకు సహకరించారు. సింధు, సాయిప్రణీత్‌ కోర్టులో చెరో వైపు నిలిచి తలపడగా, పార్క్‌ వారి మధ్యలో నిలబడి ప్రాక్టీస్‌ చేయించాడు. అసాకా రేంజ్‌లో భారత షూటర్లకు ప్రాక్టీస్‌ అవకాశం దక్కింది.

ఇదే వేదికపై పోటీలు జరగనుండటంతో నాలుగు రోజుల సాధన వల్ల మేలు కలుగుతుందని షూటర్లు భావిస్తున్నారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా షూటింగ్‌ పోటీలు ఇక్కడే నిర్వహించారు. వాటర్‌ స్పోర్ట్స్‌లో భాగంగా సెయిలింగ్‌లో పోటీ పడుతున్న వి.శరవణన్, నేత్ర కుమనన్, కేసీ గణపతి, వరుణ్‌ ఠక్కర్‌లతో పాటు రోయర్లు అర్జున్‌ లాల్, అర్వింద్‌ సింగ్‌ కూడా సీ ఫారెస్ట్‌ వాటర్‌ వే జలాల్లో సన్నద్ధమయ్యారు.  

100 ‘టీ కెటిల్స్‌’ కావాలి...
ఒలింపిక్‌ విలేజ్‌లోకి అడుగు పెట్టగానే సాధారణంగా అథ్లెట్ల నుంచి ఏదో ఒక రూపంలో ఫిర్యాదులు మొదలవుతాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. నిజంగా సమస్య ఉన్నా సర్దుకుపోవడమే తప్ప గట్టిగా అడిగే పరిస్థితి లేదు. భారత అథ్లెట్లకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో మూడు రోజులకు ఒక సారి మాత్రమే ఆటగాళ్ల గదిని శుభ్రపరుస్తారు. టవల్స్‌ కూడా గ్రౌండ్‌ఫ్లోర్‌కు వెళ్లి ప్రతీ రోజు తెచ్చుకోవాల్సిందే. ప్రాక్టీస్‌కు వెళ్లే ముందు ప్రతీ రోజు ఆటగాళ్లు తమ కోవిడ్‌ శాంపిల్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన టెస్టింగ్‌ కిట్స్‌ కూడా రోజూవారీ ప్రాతిపదికనే ఇస్తున్నారు. 

భోజనం విషయంలో మాత్రం మన అథ్లెట్లు సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. అయితే మరీ మన ఇంటి భోజనంతో పోల్చి చూడవద్దని, కొన్నిసార్లు సరిగా ఉడకకపోయినా సరే సర్దుకుపోవాల్సిందేనని భారత బృందంలో ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. స్థానిక జపాన్‌ ఫుడ్‌ను బాగా వండుతున్నారని, మరీ భారతీయ వంటకాలపై మోజు పడకుండా దానిని కూడా అలవాటు చేసుకుంటే మంచిదని కూడా ఆయన సూచించారు. 

మరోవైపు ఉదయమే వేడి నీళ్లు తాగేందుకు వీలుగా తమ గదుల్లో ఎలక్ట్రిక్‌ టీ కెటిల్స్‌ కావాలని భారత అథ్లెట్లు విజ్ఞప్తి చేశారు. ఆటగాళ్ల కోరిక మేరకు భారత రాయబార కార్యాలయం 100 కెటిల్స్‌ ఏర్పాటు చేయనుందని చెఫ్‌ డి మిషన్‌ ప్రేమ్‌ వర్మ వెల్లడించారు. మరోవైపు టెన్నిస్‌ ప్లేయర్లు సానియా మీర్జా, అంకిత రైనా, సుమిత్‌ నగాల్‌ సోమవారం న్యూఢిల్లీ నుంచి టోక్యోకు బయలుదేరి వెళ్లారు. సానియా–అంకిత ద్వయం మహిళల డబుల్స్‌లో, సుమిత్‌ పురుషుల సింగిల్స్‌లో పోటీపడతారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top