టోక్యోలో మెరిసిన భారత్‌.. ఒలింపిక్‌ చరిత్రలో అత్యధిక పతకాలు

Tokyo Olympics: India Won 7 Olympic Medals Highest Ever Was Record - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ మెరిసి మురిసింది. ఒలింపిక్స్‌ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రాణించి యావత్‌ భారతావనిని ఆకర్షించింది. ఆరంభంలోనే రజతం సాధించి సత్తాచాటిన భారత్‌.. ముగింపులో స్వర్ణాన్ని సాధించి శభాష్‌ అనిపించింది. తద్వారా ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యధిక పతకాలు దక్కించుకున్న భారత్‌  ఏడు పతకాలను ఖాతాలో వేసుకుంది. అందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ఇంతకముందు 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఆరు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అయితే దీనిని పక్కకు తోస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ మరింత అద్బుతంగా ఆడింది. ఓవరాల్‌గా ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ ఏ విభాగాల్లో పతకాలు సాధించిదనేది ఒకసారి పరిశీలిద్దాం..

నీరజ్‌ చోప్రా- స్వర్ణం(జావెలిన్‌ త్రో)
భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి  అంతర్జాతీయ వేదికపై భారత్‌ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో  నీరజ్‌ రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు విసిరి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్‌ ముగింపు ఇచ్చాడు.

మీరాబాయి చాను- రజతం(వెయిట్‌ లిఫ్టింగ్‌)
ఒలింపిక్స్‌ ప్రారంభమైన రెండో రోజే రజతం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది మీరాబాయి చాను. వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో పోటీపడింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. అయితేనేం రజతం ద్వారా భారత్‌ పతకాల బోణీని తెరిచిన తొలి వ్యక్తిగా నిలిచింది.

రవికుమార్‌ దహియా- రజతం( రెజ్లింగ్‌)
ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రవికుమార్‌ దహియా అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే అదరగొట్టాడు. 57 కిలోల రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ అర్హత, క్వార్టర్స్‌, సెమీస్‌ బౌట్లలో దుమ్మురేపి ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా ఫైనల్లో  రష్యాకు చెందిన రెజ్లర్‌ జవుర్‌ ఉగేవ్‌తో జరిగిన   హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి 7-4 తేడాతో ఓడిపోయాడు. తద్వారా సుశీల్‌ కుమార్‌ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

పీవీ సింధు- కాంస్యం( బాడ్మింటన్‌)
రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన పీవీ సింధుపై ఈ ఒలింపిక్స్‌లో మంచి అంచనాలు ఉండేవి. ఆ అంచనాలు నిజం చేస్తూ లీగ్‌, ప్రీ క్వార్టర్స్‌, క్వార్టర్స్‌లో దుమ్మురేపిన ఆమె ఒక్క గేమ్‌ కోల్పోకుండా సెమీస్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్‌చేతిలో పరాజయం పాలైన సింధు.. కాంస్య పతక పోరులో సత్తాచాటింది.  సింధు 21–13, 21–15తో చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోను చిత్తు చేసి కాంస్యం గెలిచింది. ఫలితంగా  రెండు ఒలింపిక్‌ పతకాలతో భారత క్రీడా చరిత్రలో ఎవరినీ అందనంత ఎత్తులో నిలిచింది. 

భారత మెన్స్‌ హాకీ టీమ్‌- కాంస్యం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంస్యంతో చరిత్ర సృష్టించింది. లీగ్‌ దశలో ఒక్క ఆస్ట్రేలియా మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో విజయాలతో దుమ్మురేపింది. క్వార్టర్స్‌లో గ్రేట్‌ బ్రిటన్‌పై ఘన విజయం సాధించి సెమీస్‌లో ప్రవేశించింది. అయితే సెమీస్‌లో బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో 5-4తో విజయం సాధించి ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పతకం సాధించి హాకీకి పూర్వ వైభవం తీసుకొచ్చింది.

లవ్లీనా  బొర్గోహెయిన్‌- కాంస్యం( బాక్సింగ్‌)
బాక్సింగ్‌ మహిళల 69 కిలోల విభాగం సెమీ ఫైనల్‌లో లవ్లీనా.. టర్కీ బాక్సర్‌ బుసేనాజ్‌ చేతిలో 0-5 తేడాతో లవ్లీనా పరాజయం పాలైంది. అయితే, గత నెల 30న జరిగిన క్వార్టర్స్‌లో చిన్‌ చైన్‌పై విజయం సాధించినందుకు గానూ లవ్లీనాకు కాంస్య పతకం దక్కింది. ఇక ఇప్పటి వరకు భారత బాక్సింగ్‌లో విజేందర్‌ సింగ్‌(2008), మేరీ కోమ్‌(2012) తర్వాత పతకం సాధించిన మూడో బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది.

భజరంగ్‌ పూనియా- కాంస్యం(రెజ్లింగ్‌)
ఇక భజరంగ్‌ పూనియా టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే కాంస్యంతో అదరగొట్టాడు. రెజ్లింగ్‌ 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్‌ దౌల‌త్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఉడుం పట్టు అంటే ఏంటో ప్రత్యర్థికి రుచి చూపించాడు.

► వీరు మాత్రమే గాక ఈసారి ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు, గోల్ప్‌లో అదితి అశోక్‌, రెజ్లింగ్‌లో దీపక్‌ పూనియాలు కూడా మంచి ప్రదర్శన చేశారు. ముందుగా భారత మహిళల హాకీ జట్టు ప్రదర్శన గురించి చెప్పుకోవాలి. 41 ఏళ్ల తర్వాత సెమీస్‌కు చేరుకున్న భారత మహిళల జట్టు అర్జెంటీనా చేతిలో ఓటమి పాలైంది. అయితే కాంస్య పతక పోరు కోసం  భారత అమ్మాయిల జట్టు 3–4తో బ్రిటన్‌ చేతిలో పోరాడి ఓడింది. కాగా ఒలింపిక్స్‌లో మూడో ప్రయత్నంలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానం సంపాదించిన భారత మహిళల జట్టు ప్రదర్శన కాంస్య పతకంలాంటిదేనని దేశం వారిని పొగడ్తలతో ముంచెత్తింది.

► ఆటల్లో రిచ్చెస్ట్‌ గేమ్‌గా గోల్ఫ్‌కు ఓ పేరుంది. అలాంటి ఆటలో.. అదీ ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌దాకా చేరుకుని భారత్‌కు పతక ఆశలు చిగురింపజేసింది 23 ఏళ్ల అదితి. టోక్యో ఒలింపిక్స్‌కి ముందు.. ప్రారంభమైన తర్వాతా పతకాన్ని తెస్తారనే ఆశలు ఉన్న పేర్ల లిస్ట్‌లో అదితి పేరు కనీసం ఏదో ఒక మూలన కూడా లేదు. కారణం.. మహిళా గోల్ఫ్‌ ర్యాకింగ్స్‌లో ఆమెది 200వ ర్యాంక్‌. అలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. పతాక పోరు దాకా అదితి చేరుకోవడం, ఆ పోరాటంలో ఓడి కోట్ల మంది హృదయాలను గెల్చుకోవడం ప్రత్యేకంగా నిలిచిపోయింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top