అశ్విన్‌.. నీ స్థాయికి ఇది తగునా.. మహిళతో అలా ఎలా ప్రవర్తిస్తావు..? | TNPL Drama, R Ashwin Argues With Umpire, Slams Bat After Sai Kishore Gets Him Out | Sakshi
Sakshi News home page

అశ్విన్‌.. నీ స్థాయికి ఇది తగునా.. మహిళతో అలా ఎలా ప్రవర్తిస్తావు..?

Jun 9 2025 10:54 AM | Updated on Jun 9 2025 11:07 AM

TNPL Drama, R Ashwin Argues With Umpire, Slams Bat After Sai Kishore Gets Him Out

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ తన స్థాయిని మరిచి ప్రవర్తించాడు. తనను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినందుకు ఓ మహిళా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అశ్విన్‌ దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియో చూసి అభిమానులు అశ్విన్‌పై మండిపడుతున్నారు. నీ స్థాయికిది తగునా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2025 ఎడిషన్‌లో అశ్విన్‌ దిండిగల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా నిన్న (జూన్‌ 8) దిండుగల్‌ డ్రాగన్స్‌, ఐడ్రీమ్‌ తిరుప్పుర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. సాయి కిషోర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ చివరి బంతికి అశ్విన్‌ స్వీప్‌ షాట్‌ ఆడబోయి మిస్‌ అయ్యాడు. బంతి వికెట్ల ముందు అశ్విన్‌ ప్యాడ్లకు తాకింది. 

దీంతో సాయి కిషోర్‌ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్‌ చేశాడు. అక్కడే ఉన్న మహిళా అంపైర్‌ మారు ఆలోచించకుండా అశ్విన్‌ను ఔట్‌గా ప్రకటించింది. దీంతో అశ్విన్‌ పట్టరాని కోపంతో ఊగిపోతూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్‌ పట్టించుకోకపోవడంతో అశ్విన్‌ అసహనంతో బ్యాట్‌ను తన ప్యాడ్‌కు కొట్టుకుంటూ పెవిలియన్‌ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 18 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ జట్టు దిండిగుల్‌ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన దిండిగుల్‌.. ఎసక్కిముత్తు (4-0-26-4), మతివణ్ణన్‌ (2.2-0-12-3), సాయి కిషోర్‌ (4-0-10-2) చెలరేగడంతో 16.2 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన తిరుప్పుర్‌.. తుషార్‌ రహేజా (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 11.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement