విజయోస్తు! | Thomas Cup and Uber Cup tournament from today | Sakshi
Sakshi News home page

విజయోస్తు!

Apr 24 2026 2:42 AM | Updated on Apr 24 2026 2:42 AM

Thomas Cup and Uber Cup tournament from today

నేటి నుంచి థామస్‌ కప్‌– ఉబెర్‌ కప్‌ టోర్నీ

తొలి మ్యాచ్‌లో కెనడాతో భారత పురుషుల జట్టు ‘ఢీ’

డెన్మార్క్‌తో భారత మహిళల తొలి పోరు  

నాలుగేళ్ల క్రితం జరిగిన అద్భుత ఘట్టాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత పురుషుల జట్టు... సెమీఫైనల్‌ చేరడమే తొలి లక్ష్యంగా భారత మహిళల జట్టు... ప్రతిష్టాత్మక టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ థామస్‌ కప్, ఉబెర్‌కప్‌లలో బరిలోకి దిగనున్నాయి. హెచ్‌ఎస్‌ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌ అసాధారణ ప్రదర్శనతో 2022లో భారత పురుషుల జట్టు తొలిసారి థామస్‌ కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప తదితరుల మెరుపులతో 2014, 2016లలో వరుసగా రెండు పర్యాయాలు భారత మహిళల జట్టు ఉబెర్‌ కప్‌లో సెమీఫైనల్‌ చేరుకొని కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ఈసారి అటు పురుషుల జట్టుతోపాటు ఇటు మహిళల జట్టుకు గ్రూప్‌ దశలో కాస్త అనుకూలమైన ‘డ్రా’నే పడింది. 

తమ గ్రూప్‌లో టాప్‌–2లో నిలిచి ముందుగా క్వార్టర్‌ ఫైనల్‌ చేరడమే భారత జట్ల లక్ష్యం కానుంది. ఆ తర్వాత క్వార్టర్‌ ఫైనల్‌ నాకౌట్‌ పోరులో నెగ్గితే సెమీఫైనల్‌ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకుంటాయి. బలాబలాలను పరిశీలిస్తే భారత మహిళల జట్టుతో పోలిస్తే భారత పురుషుల జట్టుకు ఈసారి పతకం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

హోర్‌సెన్స్‌ (డెన్మార్క్‌): ప్రణయ్‌... కిడాంబి  శ్రీకాంత్‌... లక్ష్య సేన్‌... సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి... ఈ ఐదుగురికి ఎలా ఆడితే థామస్‌ కప్‌లో టైటిల్‌ సాధించగలమో తెలుసు. 2022లో టీమిండియాకు థామస్‌ కప్‌ దక్కడంలో ఈ ఐదుగురు కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ ఐదుగురికి ఆయుశ్‌ శెట్టి రూపంలో రైజింగ్‌ స్టార్‌ జత కలిశాడు. ఫలితంగా 2022 చాంపియన్‌ భారత జట్టు ఈసారి థామస్‌ కప్‌లో టైటిల్‌పై గురి పెట్టింది. సింగిల్స్‌లో రెండు, డబుల్స్‌లో ఒక విజయం లభిస్తే మ్యాచ్‌ వశమవుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి బలగంతో థామస్‌ కప్‌లో అడుగు పెట్టిన భారత జట్టు రెండోసారి అద్భుతం చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. 

ఇటీవల చైనాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆయుశ్‌ శెట్టి రన్నరప్‌గా నిలిచి తన సత్తా చాటుకున్నాడు. ఫైనల్‌ చేరిన క్రమంలో టాప్‌–10లోని ముగ్గురు క్రీడాకారులను ఆయుశ్‌ ఓడించాడు. ఈ నేపథ్యంలో ఆయుశ్, లక్ష్య సేన్, ప్రణయ్, శ్రీకాంత్, సాత్విక్‌–చిరాగ్‌ తమ స్థాయికి తగ్గట్టు ఆడితే భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోవడం కష్టమేమీ కాదు. నేడు జరిగే గ్రూప్‌ ‘ఎ’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో కెనడాతో భారత్‌ తలపడుతుంది. ఆ తర్వాత 27న ఆ్రస్టేలియాతో... 29న చైనాతో టీమిండియా మ్యాచ్‌లున్నాయి.  

మరోవైపు భారత మహిళల జట్టు ఆశలన్నీ సింగిల్స్‌ ప్లేయర్స్‌పైనే ఆధారపడి ఉన్నాయి. డబుల్స్‌ స్టార్‌ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ వైదొలగడం భారత జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపకుండా ఉండాలంటే... మూడు సింగిల్స్‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్‌లు గెలవాల్సి ఉంటుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌ను నేడు ఆతిథ్య డెన్మార్క్‌ జట్టుతో ఆడుతుంది. 

గ్రూప్‌ ‘ఎ’లోనే చైనా, ఉక్రెయిన్‌ జట్లు కూడా ఉన్నాయి. చైనాపై భారత్‌ గెలిచే అవకాశాలు లేకపోవడంతో... క్వార్టర్‌ ఫైనల్‌ చేరాలంటే డెన్మార్క్, ఉక్రెయిన్‌ జట్లపై భారత్‌ నెగ్గాల్సి ఉంటుంది. డెన్మార్క్‌ చేతిలో భారత్‌ ఓడిపోతే మాత్రం నాకౌట్‌ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. డెన్మార్క్‌తో మ్యాచ్‌ అనంతరం భారత్‌ రెండో మ్యాచ్‌ను 25న ఉక్రెయిన్‌తో, మూడో మ్యాచ్‌ను 27న చైనాతో ఆడుతుంది.  

థామస్‌ కప్‌ టోర్నీకి భారత జట్టు: లక్ష్య సేన్, ఆయుశ్‌ శెట్టి, ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, కిరణ్‌ జార్జి, సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, హరిహరన్, ఎంఆర్‌ అర్జున్, ధ్రువ్‌ కపిల. 

ఉబెర్‌ కప్‌ టోర్నీకి భారత జట్టు: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్, ఇషారాణి బారువా, తనీషా క్రాస్టో, ప్రియ కొంజెంగ్‌బమ్, శ్రుతి మిశ్రా, సెల్వం కవిప్రియ, సిమ్రన్‌.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement