Thomas Cup 2022: India Beat Indonesia 3-0 To Script Historic Win - Sakshi
Sakshi News home page

Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. తొలిసారి థామస్‌ కప్‌ కైవసం

May 15 2022 3:53 PM | Updated on May 15 2022 5:35 PM

Thomas Cup 2022: India Beat Indonesia 3-0 To Script Historic Win - Sakshi

బ్యాంకాక్‌: పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్‌ కప్‌ చరిత్రలో భారత బ్యాడ్మింటన్‌ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్‌ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్‌ కప్‌ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. 

తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్‌.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకి రెడ్డి-చిరాగ్‌ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్‌ ఎహసాన్‌, కెవిన్‌ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. 

ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ జోనాటన్‌ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. భారత బృందం ఫైనల్‌ చేరే క్రమంలో (నాకౌట్‌ దశలో) మలేసియా, డెన్మార్క్‌ లాంటి పటిష్టమైన జట్లను ఖంగుతినిపించిన విషయం తెలిసిందే.

ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తి.. ప్రధాని మోదీ
73 ఏళ్ల కలను సాకారం చేసిన భారత పురుషుల బ్యాడ్మింటన్‌ బృందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్యాడ్మింటన్‌ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించిన భారత షట్లర్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌కు స్వర్ణ పతకం ఖాయం కాగానే మోదీ ట్వీట్‌ చేశారు.


"భారత బ్యాడ్మింటన్‌ బృందం చరిత్ర సృష్టించింది. ఈ విజయం పట్ల యావత్‌ భారతం గర్వంతో ఉప్పొంగిపోతుంది. స్వర్ణం గెలిచిన భారత బృందానికి శుభాకాంక్షలు.. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది" అంటూ మోదీ ట్వీట్‌ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement