చైనాదే థామస్‌ కప్‌ టైటిల్‌ | China records 5-0 win against France at Thomas Cup 2026 | Sakshi
Sakshi News home page

చైనాదే థామస్‌ కప్‌ టైటిల్‌

May 5 2026 5:38 AM | Updated on May 5 2026 5:38 AM

China records 5-0 win against France at Thomas Cup 2026

హోర్‌సెన్స్‌ (డెన్మార్క్‌): ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ పురుషుల టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో చైనా జట్టు 12వసారి విజేతగా నిలిచింది. తొలిసారి ఫైనల్‌ చేరిన ఫ్రాన్స్‌ జట్టుతో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనా 3–1తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ షి యుకీ 85 నిమిషాల్లో 21–16, 16–21, 21–17తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ క్రిస్టో పొపోవ్‌ను ఓడించి చైనాకు 1–0 ఆధిక్యం అందించాడు.

రెండో మ్యాచ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ లీ షి ఫెంగ్‌ 43 నిమిషాల్లో 13–21, 10–21తో ప్రపంచ పదో ర్యాంకర్‌ అలెక్స్‌ లానియర్‌ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. 96 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మూడో మ్యాచ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ 22–20, 20–22, 21–19తో ప్రపంచ 17వ ర్యాంకర్‌ టోమా జూనియర్‌ పొపోవ్‌పై గెలిచి చైనాను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్‌లో హీ జి టింగ్‌–రెన్‌ జియాంగ్‌ యు ద్వయం 38 నిమిషాల్లో 21–13, 21–16తో ఎలోయ్‌ ఆడమ్‌–లియో రోసీ జోడీని ఓడించి చైనాకు 3–1తో విజయాన్ని అందించింది. సెమీఫైనల్లో ఓడిన భారత్, డెన్మార్క్‌ జట్లకు కాంస్య పతకాలు లభించాయి.

12: థామస్‌ కప్‌ టైటిల్‌ను చైనా జట్టు ఇప్పటి వరకు 12 సార్లు గెల్చుకుంది. 1982, 1986, 1988, 1990, 2004, 2006, 2008, 2010, 2012, 2018, 2024, 2026లలో చైనా టైటిల్స్‌ సాధించింది. అత్యధిక సార్లు థామస్‌ కప్‌ నెగ్గిన జట్టుగా ఇండోనేసియా (14 సార్లు) అగ్రస్థానంలో ఉంది. మలేసియా (5 సార్లు) మూడో 
స్థానంలో ఉంది. భారత్, డెన్మార్క్, జపాన్‌ ఒక్కోసారి థామస్‌ కప్‌ టైటిల్‌ను సాధించాయి.  

Advertisement
 
Advertisement
Advertisement