రంగారెడ్డిపై ఖమ్మం ఏసెస్‌ విజయం | TG20 League 2026: Khammam Aces Beat Ranga Reddy By 5 Wickets | Sakshi
Sakshi News home page

రంగారెడ్డిపై ఖమ్మం ఏసెస్‌ విజయం

Jul 4 2026 6:09 PM | Updated on Jul 4 2026 6:27 PM

TG20 League 2026: Khammam Aces Beat Ranga Reddy By 5 Wickets

తెలంగాణ టీ20 లీగ్‌ (టీజీ20)-2026లో ఖమ్మం ఏసెస్‌ రంగారెడ్డి రైజర్స్‌ను చిత్తు చేసింది. ఉప్పల్‌ వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో రంగారెడ్డిపై విజయం సాధించింది. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన రంగారెడ్డి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో రంగారెడ్డి తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు సాధించింది.

ఓపెనర్లు ఆరోన్‌ జార్జ్‌ (4), అరవెల్లి అవినాశ్‌ రావు (12) విఫలం కాగా.. జ్ఞానప్రకాశ్‌ రెడ్డి (36), ఆదిత్య జవ్వాజి (43) జట్టును ఆదుకున్నారు. ఖమ్మం బౌలర్లలో కెప్టెన్‌ సీవీ మిలింద్‌ మూడు వికెట్లతో సత్తా చాటగా.. హర్షిత్‌ సాయి, వేద్‌ రెడ్డి తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. విద్యానంద రెడ్డి, షేక్‌ అజర్‌ చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఖమ్మం జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు వాఫీ కచ్చి (4), ప్రతీక్‌ రెడ్డి (17).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జీఎస్‌కే రెడ్డి (14) పూర్తిగా నిరాశపరిచారు. ఇలాంటి తరుణంలో కొడిమెల హిమతేజ, మికిల్‌ జైస్వాల్‌ మెరుపులు మెరిపించారు.

హిమతేజ 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేయగా.. మికిల్‌ 22 బంతుల్లో 30 పరుగులతో రాణించాడు. ఆఖర్లో సీవీ మిలింద్‌ 21 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలవగా.. సహేంద్ర మల్లు 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 17.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసిన ఖమ్మం.. రంగారెడ్డిని ఐదు వికెట్ల తేడాతో ఓడించింది.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement