పంత్, శుభ్‌మన్ గిల్(ఫైల్ ఫోటో)
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా సొంతగడ్డపై టెస్టు సిరీస్‌కు భారత్ సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టుకు ముందు వరుసగా మూడు రోజుల పాటు టీమ్ ప్రాక్టీస్‌లో పాల్గొంటుంది.
ఆ్రస్టేలియాలో టి20 సిరీస్ ఆడిన టెస్టు జట్టు సభ్యులు గిల్, బుమ్రా, అక్షర్, సుందర్, కోచ్ గంభీర్ ఆదివారం రాత్రి కోల్‌కతాకు చేరుకున్నారు. ఇప్పటికే భారత్‌లో ఉన్న ఇతర సభ్యులు కూడా విడివిడిగా తమ స్వస్థలాల నుంచి వచ్చి జట్టు సభ్యులతో కలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఎలాంటి ప్రాక్టీస్ జరగలేదు. నేటినుంచి పూర్తి స్థాయి జట్టు సాధన చేస్తుంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో కీలక సభ్యులైన రబాడ, యాన్సెన్ తదితరులు పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ అనంతరం ఆదివారం రాత్రే కోల్‌కతాలో అడుగు పెట్టగా, ఇప్పటికే ‘ఎ’ టీమ్ తరఫున మ్యాచ్‌లు ఆడుతూ బెంగళూరులోనే ఉన్న ఇతర ఆటగాళ్లు కూడా జట్టుతో చేరారు.
ఈ బృందంలో కెప్టెన్ తెంబా బవుమా, జుబేర్ హమ్జా, అకెర్‌మన్ తదితరులు ఉన్నారు. సఫారీ టీమ్ కూడా సోమవారం సాధన చేయలేదు. 2025లో భారత్, దక్షిణాఫ్రికాలకు ఇదే చివరి టెస్టు సిరీస్ కానుంది. ఈ సిరీస్ తర్వాత వచ్చే జూన్‌లో గానీ (అఫ్గానిస్తాన్‌తో) భారత్‌కు టెస్టు మ్యాచ్ లేదు.


