
ICC Under 19 Womens T20 World Cup 2023: సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న తొట్టతొలి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్,ఇంగ్లండ్ జట్టు తుది సమరానికి అర్హత సాధించాయి. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను, భారత్.. న్యూజిలాండ్‌ను సెమీస్‌లో మట్టికరిపించి ఫైనల్‌కు చేరాయి. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జనవరి 29) సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది.
టోర్నీలో భారత, ఇంగ్లండ్ జట్ల ప్రస్థానాన్ని గమనిస్తే.. ఇరు జట్లు పోటాపోటీగా ప్రత్యర్ధులపై పైచేయి సాధించి, తుది సమరానికి అర్హత సాధించాయి. గ్రూప్ దశలో ఇరు జట్లు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించాయి. ఈ దశలోనూ ఇరు జట్లు గ్రూప్ టాపర్‌లుగా నిలిచి సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో యువ భారత జట్టు న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. ఇంగ్లండ్ అతికష్టం మీద ఆసీస్‌ను 3 పరుగుల తేడాతో ఓడించింది.
ఇక వ్యక్తిగత ప్రదర్శనల విషయానికొస్తే.. టీమిండియా ఓపెనర్లు శ్వేత సెహ్రావత్, షెఫాలీ వర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు పోటాపోటీగా పరుగులు సాధించి, టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో 1 (శ్వేత, 6 మ్యాచ్‌ల్లో 146 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 292 పరుగులు), 4 (షెఫాలీ, 6 మ్యాచ్‌ల్లో ఒకఅర్ధసెంచరీ సాయంతో 157 పరుగులు) స్థానాల్లో నిలిచారు.
బౌలింగ్‌లోనూ భారత లెగ్ స్పిన్నర్ పర్షవి చోప్రా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ అమ్మాయి 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. మరో స్పిన్నర్ మన్నత్ కశ్యప్ కూడా ఈ టోర్నీలో అదరగొడుతోంది. ఈ అమ్మాయి ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టింది.