IPL 2024: టెస్టులో ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. సర్ఫరాజ్‌ రీఎంట్రీ!

Team India Star Sarfaraz Khan To Join KKR Ahead Of IPL 2024: Reports - Sakshi

ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, అతడి కుటుంబం ప్రస్తుతం ఆనందడోలికల్లో తేలిపోతోంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ రంజీ వీరుడు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడమే ఇందుకు కారణం.

అంతేకాదు అరంగేట్రంలోనే అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో సర్ఫరాజ్‌ ఖాన్‌ ప్రతిభపై ఇంటా బయటా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసే వార్త తెరమీదకు వచ్చింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఈ 26 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్‌ పునరాగమనం చేయనున్నాడనేది అందులోని సారాంశం. కాగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా.. భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా  టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు.

ఆ సమయంలో అక్కడే ఉన్న సర్ఫరాజ్‌ తండ్రి, కోచ్‌, మెంటార్‌ నౌషద్‌ ఖాన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడే ఉండి మ్యాచ్‌ను కూడా వీక్షించాడు. ఈ క్రమంలో తండ్రి పుత్రోత్సాహంతో పొంగిపోయేలా సర్ఫరాజ్‌ ఖాన్‌ బ్యాట్‌తో ఇరగదీశాడు.

48 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే, రవీంద్ర జడేజా రాంగ్‌కాల్‌ కారణంగా పరుగుకు వెళ్లి దురదృష్టవశాత్తూ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 68 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఈ క్రమంలో సర్ఫరాజ్‌ ఖాన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కూడా సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌కు ఫిదా అయినట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో అతడిని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఆడించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌కు గానూ గంభీర్‌ కేకేఆర్‌ మెంటార్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈసారి జరిగిన మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను రిలీజ్‌ చేయగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.

ఈ క్రమంలో అతడి సేవలను వినియోగించుకోవాలని గంభీర్‌ కేకేఆర్‌ యాజమాన్యానికి సూచించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం వేలం ముగిసిన తర్వాత ఫ్రాంఛైజీలు ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకునే వీలులేదు. అయితే, ఎవరైనా ఆటగాడు గాయపడితే మాత్రం అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుంటుంది.

ఈ నేపథ్యంలో కేకేఆర్‌ శిబిరంలోని ఏ ఆటగాడైనా ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిస్తే వెంటనే సర్ఫరాజ్‌ను పిలిపించేందుకు ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు బెంగాల్‌ వార్తా పత్రిక ఆనంద్‌బజార్‌ కథనం ప్రచురించింది. 

కాగా సర్ఫరాజ్‌ ఖాన్‌ గతంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 37 ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌ ఆడిన అతడు 22.5 సగటుతో 585 పరుగులు సాధించాడు.

చదవండి: మార్చి 22న ఐపీఎల్‌ 2024 ప్రారంభం.. సంకేతాలు ఇచ్చిన లీగ్‌ చైర్మన్‌

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top