T20 WC 2021 PAK Vs NAM: దుమ్మురేపిన ఓపెనర్లు.. ఐదోసారి సెమీస్‌కు పాకిస్తాన్‌

T20 World Cup 2021: Pakistan Beat Namibia By 45 Runs Enters Semi Final - Sakshi

నమీబియాపై 45 పరుగులతో గెలుపు 

చెలరేగిన రిజ్వాన్, బాబర్‌ ఆజమ్‌

అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో విజయంతో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. గ్రూప్‌–2లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ ఆజమ్‌ బృందం 45 పరుగుల తేడాతో క్రికెట్‌ కూన నమీబియాపై జయభేరి మోగించి ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో ఐదోసారి సెమీఫైనల్‌కు చేరింది. మొదట పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (50 బంతుల్లో 79 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ (49 బంతుల్లో 70; 7 ఫోర్లు) చెలరేగారు. మొదట నింపాదిగా ఆడిన ఈ ఓపెనర్లు తర్వాత దంచేశారు. జట్టు స్కోరు తొమ్మిదో ఓవర్లో 50 పరుగులకు చేరింది. తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడటంతో కేవలం 4 ఓవర్ల వ్యవధిలో 13వ ఓవర్లో పాక్‌ 100 పరుగులను అధిగమించింది. ఈ క్రమంలో బాబర్‌ (39 బంతుల్లో; 5 ఫోర్లు), రిజ్వాన్‌ (42 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీలు పూర్తిచేసుకున్నారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 14.2 ఓవర్లలో 113 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. వన్‌డౌన్‌లో ఫఖర్‌ జమన్‌ (5) విఫలమవ్వగా.... ఆఖర్లో హఫీజ్‌ (16 బంతుల్లో 32 నాటౌట్‌; 5 ఫోర్లు) ధాటిగా ఆడాడు.

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసి ఓడింది. డేవిడ్‌ వీస్‌ (31 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), క్రెయిగ్‌ విలియమ్స్‌ (37 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఓపెనర్‌ స్టీఫెన్‌ బార్డ్‌ (29; 1 ఫోర్, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ, ఇమద్, రవూఫ్, షాదాబ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

టి20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధికంగా ఐదుసార్లు సెమీఫైనల్‌ దశకు చేరుకున్న తొలి జట్టుగా పాకిస్తాన్‌ ఘనత వహించింది. 2007లో రన్నరప్‌ గా నిలిచిన పాక్‌... 2009లో చాంపియన్‌ అయ్యింది. 2010, 2012లలో సెమీస్‌లో ఓడింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top