టీ20 వరల్డ్‌కప్: ఫాస్టెస్ట్‌ సెంచరీ.. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ

T20 WC: Few Records In Short Format Cricket World Cup - Sakshi

ఇలా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముగిసిందో లేదో మరో టీ20 సమరానికి తెరలేచింది. అది కూడా వరల్డ్‌కప్‌ రూపంలో ప్రేక్షకుల్ని కనువిందు చేయడానికి వచ్చేసింది. బ్యాట్‌కి బాల్‌కి జరిగే ఈ మెగా టోర్నీలో మరొకసారి సంచలన ప్రదర్శనలు చేయడానికి క్రికెట్‌ జట్లు సిద్దమైపోగా వీక్షించడానికి ప్రేక్షకులు రెట్టించిన ఉత్సాహం ఎదురుచూస్తున్నారు. నేటి(ఆదివారం, అక్టోబర్‌ 17) నుంచి క్వాలిఫయింగ్‌ పోటీలతో  టీ20 వరల్డ్‌కప్‌ సమరం ఆరంభం అయ్యింది. దీనిలో భాగంగా ఓవరాల్‌గా ఈ టోర్నీకి సంబంధించి కొన్ని విశేషాలను చూద్దాం. 

ఫాస్టెస్ట్‌ సెంచరీ..
టీ20 క్రికెట్‌లో హార్డ్‌ హిట్టర్‌గా పేరుగాంచిన వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ రెండు సందర్భాల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీలు నమోదు చేశాడు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సఫారీలపైనే బ్యాట్‌ ఝుళిపించాడు గేల్‌. 50 బంతుల్లోనేసెంచరీ బాదేసి రికార్డు నెలకొల్పాడు.  అటు తర్వాత ఆ రికార్డును తనే బ్రేక్‌ చేశాడు గేల్‌. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ 48 బంతుల్లో శతకం బాదేశాడు. 11 సిక్స్‌లు, 5 ఫోర్ల సాయంతో సెంచరీ కొట్టేశాడు. తద్వారా 9 ఏళ్ల తర్వాత తన రికార్డును తానే సవరించుకున్నాడు గేల్‌.

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ
టీ20 క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీని తన పేరిట లిఖించుకున్నాడు. అది కూడా ఆరంభపు టీ20 వరల్డ్‌కప్‌లో కావడం విశేషం. 2007లో  దక్షిణాఫ్రికా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ విశ్వరూపం ప్రదర్శించాడు. 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం మరొక విశేషం. 

అత్యధిక పరుగులు
టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేలా జయవర్థనే పేరిట ఉంది. 2007 నుంచి 2014 వరకూ 31 టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడిన జయవర్థనే 1016 పరుగులు సాధించాడు. నేటికీ ఇదే అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. ఈ జాబితాలో గేల్‌(920-28 మ్యాచ్‌లు), దిల్షాన్‌(897-35 మ్యాచ్‌లు),కోహ్లి(777- 16 మ్యాచ్‌లు) వరుస స్థానాల్లో ఉన్నారు. 

అత్యధిక వికెట్లు
టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది ముందు వరుసలో ఉన్నాడు.  తన టీ20 వరల్డ్‌కప్‌ కెరీర్‌లో 34 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్రిది 39 వికెట్లు సాధించి ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో లసిత్‌ మలింగా 31 మ్యాచ్‌ల్లో 38 వికెట్లతో ఉండగా, సయిద్‌ అజ్మల్‌ 23 మ్యాచ్‌ల్లో 36 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

అత్యధిక డిస్మిసల్స్‌
భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుని ఒక సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా నిలిచిన ధోని.. టీ20 వరల్డ్‌కప్‌లో కూడా పలు రికార్డులను సాధించాడు. తొలి టీ20 వరల్డ్‌కప్‌ను సాధించడమే కాకుండా, ఈ మెగా టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్‌ చేసిన రికార్డును కూడా నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోని 32 డిస్మిసల్స్‌తో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక 2007 నుంచి 2017 వరకూ టీమిండియాకు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని.. ప్రతీ టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఒక జట్టుకు కెప్టెన్‌గా చేసిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top