IND VS NZ 2nd T20: న్యూజిలాండ్‌పై సెంచరీ.. రికార్డుల మోత మోగించిన సూర్యకుమార్‌

Suryakumar Yadav First Batter To Score T20 Hundred In New Zealand - Sakshi

పొట్టి క్రికెట్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. ఆడింది తక్కువ మ్యాచ్‌లే (41) అయినా రికార్డుల రారాజుగా తయారయ్యాడు. మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్‌ 20) జరిగిన రెండో టీ20లో విధ్వంసకర శతకం (51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 నాటౌట్‌) బాదిన సూర్య.. మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో రెండో శతకం బాదిన సూర్యకుమార్‌.. 

  • ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో రెండు సెంచరీలు సాధించిన రెండో టీమిండియా బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ రికార్డును సమం చేశాడు. హిట్‌మ్యాన్‌ 2018లో ఈ ఘనత సాధించాడు.
  • న్యూజిలాండ్‌ గడ్డపై టీ20ల్లో శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు.
  • అంతర్జాతీయ టీ20ల్లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు (11) సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో స్కై.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (10)ను అధిగమించాడు. ఈ జాబితాలో మహ్మద్‌ రిజ్వాన్‌ (13) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.  
  • అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ రికార్డును సమం చేశాడు. రాహుల్‌ 72 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు చేయగా, సూర్యకుమార్‌ 41 మ్యాచ్‌ల్లోనే 2 శతకాలు బాదాడు. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ (4 సెంచరీలు) వీరిద్దరి కంటే ముందున్నాడు.
  • సూర్య.. తన తొలి సెంచరీని సైతం విదేశీ గడ్డపైనే చేశాడు. అతను ఇంగ్లండ్‌పై నాటింగ్‌హ‌మ్‌లో మొద‌టి సెంచ‌రీ (117 ప‌రుగులు) బాదాడు. ఇలా టీ20ల్లో చేసిన రెండు శతాకలు కూడా విదేశీ గడ్డపైనే నమోదు కావడం కూడా ఓ రికార్డే. 

సూర్యకుమార్‌.. తన టీ20 కెరీర్‌లో 39 ఇన్నింగ్స్‌ల్లో 181.64 స్ట్రయిక్‌ రేట్‌తో 45 సగటున 1395 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, సూర్యకుమార్‌ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా తొలి టీ20 పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. సూర్యకుమార్‌ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఛేదనలో ఆది నుంచే తడబడిన కివీస్‌.. దీపక్‌ హుడా (4/10), చహల్‌ (2/26), సిరాజ్‌ (2/24), సుందర్‌ (1/24), భువనేశ్వర్‌ (1/12) ధాటి​కి 18.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top