రైనా విలవిల.. నాకే ఎందుకిలా?

Suresh Raina Worries About His Cricket Career - Sakshi

వెబ్‌స్పెషల్‌: సురేశ్‌ రైనాలో అంత‍ర్మథనం మొదలైంది. తాను వచ్చే ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ఆడతానా.. లేదా అనే అనుమానం తలెత్తింది. ఇందుకు కారణం మనకు తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడటానికి ఎంతో ఉత్సాహంగా యూఏఈ  ఫ్లయిట్‌ ఎక్కిన రైనా.. అంతే వేగంగా వెనక్కి వచ్చేశాడు.  సోషల్‌ మీడియాలో దుబాయ్‌ లైఫ్‌ గురించి ఒకటి-రెండు ఫోటోలు పెట్టడంతోనే రైనా సరిపెట్టుసుకున్నాడు. అసలు అక్కడ ఏమి జరిగిందో మనకు తెలీదు.. రైనా ఎందుకు వచ్చేశాడు ఇంకా క్లారిటీ లేదు. మేనత్త భర్తను ఎవరో దుండగులు హత్య చేయడంతోనే స్వదేశానికి వచ్చేశాడని రైనా చెప్పాడు. ఒకవేళ అదే జరిగితే మళ్లీ తనకు అవకాశం ఇస్తే సీఎస్‌కేతో కలుస్తాననే మాట అనడు. అలాగే ఫ్రాంచైజీ కూడా రైనా మీద కనికరం చూపేది. దీన్ని బనీట్టి మనకు ఎంతో కొంత అర్థమవుతున్న విషయం ఏమిటంటే.. ‘ ఏదో జరిగింది’ అనేది క్లియర్‌గా తెలుస్తోంది. ఏది ఏమైనా రైనా మనసంతా సీఎస్‌కే పైనే ఉంది. కనీసం అతనికి పిలుపు రాకపోయినా, తాను జట్టుతో లేకపోవడాన్ని ఊహించుకోలేకపోతున్నాననే రైనా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక కామెంట్‌ ఇందుకు ఉదాహరణ. [చదవండి: జట్టు సెలక్షన్‌ విషయంలో కెప్టెన్‌గా కోహ్లి మార్కు కనబడదు ]

రీఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు..
ఎప్పుడో రెండేళ్ల కిందట భారత క్రికెట్‌ జట్టు తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన రైనా.. ఈసారి ఐపీఎల్‌లో సత్తాచాటాలని భావించాడు. ఈ విషయాన్ని ఐపీఎల్‌కు ముందే చాలాసార్లు చెప్పాడు రైనా. కానీ అక్కడ జరిగింది మరొకటి. తన సహచర క్రికెటర్‌, తనకెంతో ఇష్టమైన కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరుణంలో తాను కూడా అతనే బాటలోనే అంటూ రిటైర్మెంట్‌ ప్రకటించేశాడు. అంటే భారత్‌ క్రికెట్‌ జట్టుకు ఇక ఆడే ఉద్దేశం లేదని ప్రకటించేశాడు. ఇది అనాలోచిత నిర్ణయమే. టీమిండియా జట్టులో మిడిల్‌ ఆర్డర్‌ ఇంకా వీక్‌గానే ఉంది. ప‍్రధానంగా నాల్గో స్థానం ఇప్పటికీ సెట్‌ కాలేదు. ఒకవేళ ఐపీఎల్‌లో ఆడి రైనా సత్తాచాటి ఉంటే పునరాగమనంపై ఆశలు ఉండేవి. అనాలోచితంగా ఆకస్మికంగా రిటైర్మెంట్‌ ప్రకటించడంతో రైనా ఇలా ఎందుకు చేశాననే ప్రశ్న తలెత్తే ఉంటుంది. ఒకవేళ పునః సమీక్ష చేసుకున్నా నిరూపించుకోవడానికి ఐపీఎల్‌ వంటి చక్కటి వేదికను మిస్సయ్యాడు. దాంతో పాటు దాదాపు రూ. 11 కోట్లను కూడా కోల్పోవల్సిన పరిస్థితి వచ్చింది.(చదవండి:రబడా ‘సూపర్‌’ షో)
ఒక చాన్స్‌ ఇవ్వండి..
యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చేసిన తర్వాత తాను ఆడతానని, మళ్లీ చాన్స్‌ ఇవ్వాలని ఫ్రాంచైజీని కోరాడు. ఈ విషయంలో ఫ్రాంచైజీ యజమాని ఎన్‌ శ్రీనివాసన్‌ తొలుత ఆగ్రహం వ్యక్తం చేసినా తర్వాత మెత్తబడ్డారు. రైనా తన కొడుకులాంటి వారిని చెప్పుకొచ్చారు. దాంతో వివాదం ముగిసిపోయిందనుకున్నాం.. ఇంకేంటి రైనాకు మళ్లీ చాన్స్‌ అని కూడా భావించాం. ఇప్పటికైతే రైనాకు సీఎస్‌కే నుంచి ఎటువంటి పిలుపురాలేదు. అదే సమయంలో అతని పేరును సీఎస్‌కే వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి కూడా తొలగించారనే వార్తలు కూడా వచ్చాయి. అంటే రైనాకు జట్టులో చోటు లేదనేది అర్థమైపోతుంది. ఎప్పటిలాగే మిస్టర్‌ కూల్‌గా పిలవబడే సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని నుంచి కూడా ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ మ్యాచ్‌లు చూస్తున్న రైనాకు తప్పు చేశాననే భావన రాకమానదు. రెండు అనాలోచిత నిర‍్ణయాలు రైనా కెరీర్‌ ఒక్కసారిగా తలక్రిందులైంది. ఒకటి అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం, ఇంకోటి సీఎస్‌కే జట్టును వదిలి వచ్చేయడం ఈ రెండూ రైనాను వేధిస్తూనే ఉంటాయి.

రైనా.. నువ్వు గుర్తుకొస్తున్నావ్‌..
సీఎస్‌కేకు రైనా దూరం కావడంతో అతని ఫ్యాన్స్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడాన్నే జీర్ణించుకోలేని అభిమానులు.. సీఎస్‌కేను వీడి రావడంతో ఇంకా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏమైంది రైనాకు, ఎందుకిలా చేస్తున్నాడు అనుకోవడం తప్పితే చేయడానికి కూడా ఏమీలేకుండా పోయింది. కానీ ఫీల్డ్‌లో దిగితే అటు బ్యాట్‌తో ఇటు ఫీల్డింగ్‌లో సత్తాచాటే రైనాను మిస్సవుతున్నాం అంటూ సరిపెట్టుకుంటున్నారు. ‘ నీ లాఫ్టెడ్‌ షాట్లు, నీ కవర్‌ డ్రైవ్‌లు, లాంగాన్‌ మీదుగా కొట్టే సిక్స్‌లు మాకు మళ్లీ కనిపించవా రైనా’, ‘ కవర్స్‌లో నీ ఫీల్డింగ్‌ డైవ్‌లు, బౌండరీ లైన వద్ద ఫీల్డింగ్‌ మెరుపులు మళ్లీ ఎప్పుడు చూస్తాం రైనా’ అంటూ ఫ్యాన్స్‌ సైతం విలవిల్లాడిపోతున్నారు. తన కుటుంబంపై జరిగిన దాడితో కలుపుకుని ఈ ఏడాది వరుస షాక్‌లతో విలపిస్తున్న రైనా.. నాకేందుకిలా జరుగుతోంది’ అంటూ లోలోపల కుమిలిపోతున్నాడు. ఈ సీజన్‌లో ఏదో తప్పు జరిగిపోయిందని సరిపెట్టుకుని.. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు రైనా సిద్ధమైనా అప్పటికి పరిస్థితులు అతనికి ఎంతవరకూ ఫేవర్‌గా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ సీఎస్‌కేని వీడి వేరే ఫ్రాంచైజీకి వెళ్లినా కనీన ధరతో వేలంలో ఉండాలి.  అంటే అది అతనికి సవాల్‌. ఎంతో విలువైన ఆటగాడై ఉండి క్రికెట్‌ కెరీర్‌ ఏమౌతుందో అనే బెంగ రైనాను ఇప‍్పటికైతే వేధిస్తోంది. రైనా కెరీర్‌ అర్థాంతరంగా ముగిసిపోకుండా  రాబోవు రోజులైన అనుకూలంగా ఉంటాయని ఆశిద్దాం. ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్‌లో క్రికెట్‌ అకాడమీ పెట్టాలనుకుంటున్న రైనా సక్సెస్‌ కావాలని కోరుకుందాం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top