చెన్నై ‘హైరానా’ 

Suresh Raina Will Not Play Entire IPL 2020 - Sakshi

ఐపీఎల్‌కు సురేశ్‌ రైనా దూరం

వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న స్టార్‌ క్రికెటర్‌ 

జట్టులో మరో ఆటగాడికి కరోనా

ఐపీఎల్‌ షెడ్యూల్‌ కూడా రాకముందే మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో షాక్‌ తగిలింది. టీమ్‌లో అత్యంత కీలక ఆటగాడు సురేశ్‌ రైనా అనూహ్యంగా లీగ్‌కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలు అంటూ ‘చిన్న తలా’ తప్పుకోవడం జట్టును విస్మయానికి గురి చేసింది. ఇక మరో యువ ఆటగాడు కూడా కరోనా బారిన పడటంతో టీమ్‌లో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి  ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉండటం మినహా ఆ జట్టుకు మరో దారి లేకపోయింది. జట్టులోని విదేశీ ఆటగాళ్లు కూడా భయపడుతున్నట్లు సమాచారం.   

దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రధాన ఆటగాడు సురేశ్‌ రైనా ఐపీఎల్‌–2020నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతను తిరిగి భారత్‌కు పయనమయ్యాడు. ‘వ్యక్తిగత కారణాలతో రైనా స్వదేశానికి వెళ్లిపోతున్నాడు. అతను ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండడు. ఈ కష్టకాలంలో రైనాకు, అతని కుటుంబ సభ్యులకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం పూర్తి అండగా నిలుస్తుంది’ అని సీఎస్‌కే అధికారిక ప్రకటన జారీ చేసింది. సీఎస్‌కే ప్రకటనలో రైనా వెళ్లిపోవడానికి కారణం ఏమీ చెప్పలేదు. కొన్నాళ్ల క్రితం అతని దగ్గరి బంధువుల్లో ఒకరు పంజాబ్‌లోని పఠాన్‌ కోట్‌ సమీపంలో హత్యకు గురయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే ఈ ఘటన కారణం కాకపోవచ్చని కూడా కొందరు చెబుతున్నారు. ఇది జరిగిన ఆగస్టు 19న రైనా చెన్నైలోనే ఉన్నాడు. ఆ తర్వాత 21న జట్టుతో పాటు దుబాయ్‌కు వచ్చాడు. ఆ సమయంలోనూ అతను ఏదైనా ఆందోళనలో ఉన్నట్లు కనిపించలేదు. కారణం ఏదైనా సరే చెన్నై జట్టులో రైనా అమూల్యమైన ఆటగాడు. లీగ్‌ ప్రారంభమైన 2008నుంచి మధ్యలో రెండేళ్లు నిషేధం మినహా అతను 2019 వరకు అదే జట్టుకు ఆడాడు. సీఎస్‌కే జట్టు ఐపీఎల్‌లో 165 మ్యాచ్‌లు ఆడితే ఒకటి మినహా అతను 164 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి (5412) తర్వాత రైనా (5368) రెండో స్థానంలో ఉన్నాడు. అతను తప్పుకోవడం అంటే జట్టుకు పెద్ద దెబ్బగా భావించవచ్చు. 

‘నా వల్ల కావడం లేదు’ 
బుడగ బద్దలైంది...పైకి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ‘బయో సెక్యూర్‌ బబుల్‌’ ఆటగాళ్లను మానసికంగా ఎంతో దెబ్బ తీస్తోందనేదానికి ఇది సరైన ఉదాహరణ. చెన్నై జట్టులోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రైనా తప్పుకునేందుకు ‘కరోనా భయం’ కారణమని తెలుస్తోంది. కఠిన నిబంధనల కారణంగా వచ్చిన రోజునుంచి ఒంటరిగా హోటల్‌ గదిలోనే ఉండాల్సి రావడం, ఆ హోటల్‌ కూడా ఊరికి దూరంగా ఉండటంతో పాటు బయటకు వెళ్లి  బ్యాట్‌ పట్టలేని పరిస్థితి, ఇంకా టోర్నీ షెడ్యూల్‌ కూడా రాకపోవడం రైనాను కలవరపాటుకు గురి చేశాయి.

దీపక్‌ చహర్‌ సహా తమ బృందంలో 10 మందికి కరోనా వచ్చిందని తెలియగానే అతని ఆందోళన మరింత పెరిగింది. శనివారం ఉదయమే అతను తన బాధను ధోనికి, కోచ్‌ ఫ్లెమింగ్, సీఈఓ కాశీ విశ్వనాథన్‌లకు వెల్లడించాడు. కుటుంబం గుర్తుకొస్తోందని, ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారని... ఇక ఇక్కడ ఉండటం తన వల్ల కాదని రైనా వారికి చెప్పేశాడు. బయో బబుల్‌ వాతావరణంలో తాను బందీని కాదల్చుకోలేదని, కరోనా భయం వెంటాడుతోందని చెప్పి రైనా తప్పుకున్నాడు. కోట్లాది రూపాయల కాంట్రాక్ట్‌కంటే అతను కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వటం చెన్నై మేనేజ్‌మెంట్‌ను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.  మరోవైపు రైనా మేనత్త భర్త దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top