పంజాబ్ సిక్సర్ల మోత వెనుక ర‌హ‌స్య‌మిదే! | Know About The Secret Behind How Ricky Ponting Transformed Punjab Kings Into Six Hitting Force, Read Story Inside | Sakshi
Sakshi News home page

IPL 2026: పంజాబ్ సిక్సర్ల మోత వెనుక ర‌హ‌స్య‌మిదే.. బయటపెట్టిన తెలుగు క్రికెటర్‌!

Apr 4 2026 11:10 AM | Updated on Apr 4 2026 12:25 PM

Story How Ricky Ponting Transformed Punjab Kings Into Six-Hitting Force

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ దూకుడు మీద ఉంది. బ‌ల‌మైన బ్యాటింగ్ శ‌క్తితో లీగ్‌లో వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని నమోదు చేసింది. గ‌త సీజ‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ సీజ‌న్‌లోనూ అదే జోరును ప్ర‌ద‌ర్శిస్తోంది. తొలి మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్ శుక్ర‌వారం చెన్నై సూప‌ర్‌కింగ్స్‌ను మ‌ట్టిక‌రిపించింది. 

రెండు మ్యాచ్‌లు క‌లిపి పంజాబ్ మొత్తం 23 సిక్స‌ర్లు బాదింది. ఇందులో గుజ‌రాత్‌పై 14, చెన్నైపై 9 సిక్స‌ర్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటివరకు అన్ని సీజన్లు కలిపి 1,686 సిక్సర్లు బాదింది.  దూకుడైన బ్యాటింగ్‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను భ‌య‌పెడుతున్న పంజాబ్ ఇంత బ‌లంగా త‌యార‌వ్వ‌డం వెనుక దాగున్న ర‌హ‌స్యాన్ని భార‌త మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు బ‌య‌ట‌పెట్టాడు. 

పంజాబ్ వ‌రుస‌ విజ‌యాల్లో జ‌ట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేన‌న్నాడు. ప‌వ‌ర్ హిట్టింగ్ కోసం పాంటింగ్ ఉప‌యోగించిన స్క్వాష్ బాల్‌ టెక్నిక్ ఇప్పుడు పంజాబ్ బ్యాట‌ర్ల‌కు వ‌రంగా మారింద‌ని తెలిపాడు. పాంటింగ్‌ కోచ్‌గా వచ్చిన తర్వాత పంజాబ్‌ బ్యాటింగ్‌లో బలం పెరిగింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌లు సిక్సర్లు కొట్టడంలో మరింత రాటుదేలారు. 

ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అంబ‌టి రాయుడు మాట్లాడుతూ.. ‘పాంటింగ్‌తో ఉన్న అనుబంధం గురించి ఒక విష‌యం పంచుకోవాల‌నుకుంటున్నా. నేను ముంబై ఇండియ‌న్స్‌కు ఆడిన‌ప్పుడు అత‌డు మా కోచ్‌గా ఉన్నాడు. నా హిట్టింగ్ స్పీడ్‌ను పెంచేందుకు పాంటింగ్ కొత్త ప‌ద్దతిని ఉప‌యోగించాడు. ప్రాక్టీస్ స‌మ‌యంలో పాంటింగ్ నా చేతి గ్లోవ్స్ మ‌ధ్య‌లో స్క్వాష్‌బాల్‌ను ఉంచేవాడు. 

దీనివ‌ల్ల చేతి కింది భాగంలో బ్యాట్‌ను గ‌ట్టిగా ప‌ట్టుకోవ‌డానికి ఆస్కార‌ముండ‌దు. దీంతో మ‌న హిట్టింగ్‌లో స్పీడ్ పెరుగుతుంది. ఈ టెక్నిక్ వ‌ల్లే అప్ప‌ట్లో నేను  చాలా మ్యాచ్‌ల్లో సులువుగా సిక్స‌ర్లు కొట్టేవాడిని. తాజాగా పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్లు ఈజీగా సిక్స‌ర్లు కొట్ట‌డం నాకు పెద్ద‌గా ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు. 

ఎందుకంటే అక్క‌డ పాంటింగ్ హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. వాస్త‌వానికి ఎవ‌రైనా సిక్స‌ర్లు కొడతారు. కానీ స్వ్కాష్‌బాల్‌ టెక్నిక్ వ‌ల్ల బ్యాట్ స్పీడ్ పెరిగి బంతి ఎంత వేగంగా వ‌చ్చినా సులువుగా సిక్స‌ర్లు బాదేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.’ అని చెప్పుకొచ్చాడు.

ఏమిటీ స్క్వాష్‌బాల్ టెక్నిక్‌?
పాంటింగ్ ఉప‌యోగించే స్క్వాష్‌బాల్ టెక్నిక్‌లో స్వ్కాష్‌ బంతిని బ్యాట‌ర్ చేతి గ్లోవ్స్ మ‌ధ్య‌ ఉంచుతారు. దీనివ‌ల్ల చేతి కింది బాగంలో ఖాళీ ఏర్ప‌డి బ్యాట్ గ‌ట్టిగా ప‌ట్టుకోలేము. దీనివ‌ల్ల బ్యాట్‌కు గ్రిప్ రావ‌డంతో పాటు హిట్టింగ్ స్పీడ్ పెరుగుతుంది. 

2007 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో అప్ప‌టి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ స‌హా ఓపెన‌ర్ ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్‌లు వారి కోచ్ బాబ్ మ్యూల్‌మ‌న్ స‌ల‌హా మేర‌కు ఇలాంటి టెక్నిక్‌ను ఉప‌యోగించే అల‌వోక‌గా సిక్స‌ర్లు బాద‌డం నేర్చుకున్నారు. ఇప్పుడదే టెక్నిక్‌ను పాంటింగ్‌ పంజాబ్‌ బ్యాటర్లపై ప్రయోగించి విజయవంతమయ్యాడు.

చదవండి: ‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement