
జట్టు నుంచి తప్పుకునే యోచనలో స్పిన్నర్
చెన్నై: సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్–2026కు ముందు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. తన సొంత జట్టులాంటి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నుంచి అతను తప్పుకోవాలనే యోచనలో ఉన్నాడు. ఈ విషయాన్ని అతను సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌తో ఇప్పటికే చర్చించాడు. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే కటాఫ్ తేదీకి ముందు సాధారణంగా అన్ని జట్లూ తమ ఆటగాళ్లతో భేటీ అవుతాయి.
ఇందులో భాగంగానే జరిగిన సమావేశంలో అశ్విన్ తన మనసులో మాటను చెప్పాడు. అతని నిర్ణయం వెనుక కారణాలు తెలియకపోయినా... త్వరలోనే దీనిపై సీఎస్‌కే స్పష్టతనివ్వనుంది. మరో సమాచారం ప్రకారం వచ్చే ఏడాది కోసం జట్టు పునర్నిర్మాణంలో భాగంగా అశ్విన్‌ను తప్పించాలని మేనేజ్‌మెంట్ స్వయంగా భావిస్తోంది. దీంతో అశ్విన్ కూడా మరో జట్టు వైపు చూస్తున్నాడు.
‘కాన్‌ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రస్ట్’ సమస్య రాకూడదని సీఎస్‌కే ఆధ్వర్యంలోని అకాడమీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ పదవికి కూడా అశ్విన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. 2025 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో చెన్నై చివరి స్థానంలో నిలిచింది. 9 మ్యాచ్‌లే ఆడిన అశ్విన్ ఏకంగా 9.12 ఎకానమీతో 7 వికెట్లే తీయగలిగాడు.
సీఎస్‌కే దిద్దిన స్టార్...
చెన్నై సూపర్ కింగ్స్ అతి పెద్ద మ్యాచ్ విన్నర్‌లలో ఒకడిగా అశ్విన్ గుర్తింపు పొందాడు. తొలిసారి అతను 2009లో సీఎస్‌కే టీమ్ ద్వారానే లీగ్‌లో అడుగు పెట్టాడు. రెండు సీజన్లు నిలకడైన ప్రదర్శన, ధోని అండతో అతనికి భారత జట్టులో స్థానం దక్కింది. 2010, 2011లో సీఎస్‌కే టైటిల్స్ సాధించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. వరుసగా ఏడేళ్ల పాటు 2015 వరకు చెన్నైకి ఆడిన అనంతరం ఆ తర్వాత ఎనిమిది సీజన్లు వరుసగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు అశ్విన్ ప్రాతినిధ్యం వహించాడు.
2025 వేలంలో రూ.9 కోట్ల 75 లక్షల మొత్తానికి చెన్నై అతడిని మళ్లీ సొంతం చేసుకుంది. సూపర్ కింగ్స్ తరఫున 106 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 6.68 ఎకానమీతో 97 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అతను 221 మ్యాచ్‌లలో 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల అశ్విన్ గత డిసెంబర్‌లో ఆ్రస్టేలియాపై అడిలైడ్‌తో టెస్టు మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.