టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ దూకుడు స్వభావం అందరికి తెలిసిందే. గతంలో ఆటగాడిగానైనా, ఇప్పుడు కోచ్‌గానైనా అదే దూకుడు మంత్రం గంభీర్‌ను ప్రత్యేకంగా నిలిపింది. కొన్నిసార్లు అదే దూకుడుతనం గొడవలకు కూడా దారి తీసింది. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో వైరం కూడా అలాంటి కోవకు చెందినదే.
అయితే కోచ్‌గా గంభీర్ అంత కఠినంగా, మొరటుగా ఉండాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. అదే సమయంలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా గంభీర్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడంలోనూ విజయవంతమయ్యాడని ప్రశంసించాడు.
గంగూలీ మాట్లాడుతూ.. ‘నిజానికి గంభీర్ కాస్త మొరటు వ్యక్తే కావొచ్చు. కానీ అతనో పోరాటయోధుడు. నేను అతడితో కలిసి ఆడాను. అతడు పోటీతత్వం కలవాడు. ప్రతీ మ్యాచ్‌ను భారత్ గెలవాలని బలంగా కోరుకునేవాడు. జట్టు కోసమే ఎప్పుడు మాట్లాడుతాడు. ఎల్లప్పుడూ సమిష్టితత్వాన్ని కోరుకుంటాడు. కోచ్‌గా గంభీర్‌కు అసలైన సవాల్ ముందుంది.
సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ (వైట్‌బాల్‌క్రికెట్) గంభీర్ ముందున్న అతిపెద్ద లక్ష్యం. అక్కడి పరిస్థితులు అతనికి పరీక్షే అయినప్పటికీ కచ్చితంగా తన లక్ష్యాలను చేరుకోవడానికే ప్రయత్నిస్తాడు. ఇక రెడ్‌బాల్ (టెస్టు క్రికెట్)లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఇంగ్లండ్ సిరీస్ గంభీర్‌కు ఒక ఉదాహరణ. కోచ్‌గా అతను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’అని చెప్పుకొచ్చాడు.
భారత ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించాడు. అందులో ఒకటి 2025 చాంపియన్స్ ట్రోఫీ కాగా, మరొకటి 2026 టీ20 ప్రపంచకప్. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ కానుంది. ఇం2్లండ్‌లో సుదీర్ఘమైన వైట్ బాల్ సిరీస్‌కు ముందు భారత్ అఫ్గానిస్థాన్, ఐర్లాండ్‌లతో సిరీస్‌లు ఆడనుంది.


