ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (జూన్ 13) జరిగిన తొలి వన్డేలో అజేయమైన 84 పరుగులు చేసి టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో పలు అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న అతడు.. ఈ ఘనత (కనీసం 3000 పరుగులు) సాధించిన బ్యాటర్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (53.43), ఏబీ డివిలియర్స్ (53.50), మైఖేల్ బెవాన్ (53.58) లాంటి హేమాహేమీలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరాడు. ప్రస్తుతం టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (58.71) మాత్రమే గిల్ (57.30) కంటే ముందున్నాడు.
ఈ ఇన్నింగ్స్‌తో గిల్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్‌లు) 3000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధవన్ (72 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (75 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా చూస్తే, ఈ రికార్డు సౌతాఫ్రికా బ్యాటర్ హషిమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ (102) మెరుపు శతకంతో చెలరేగాడు. అతడు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (26) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలో 3 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, నితీశ్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 195 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. గిల్ (84 నాటౌట్) సత్తా చాటడంతో 22.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. గిల్‌కు ఇషాన్ కిషన్ (34), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) సహకరించగా.. రోహిత్ శర్మ (16), శ్రేయస్ అయ్యర్ (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో జరగనుంది.


