గాయంతో శ్రేయాంక ఔట్‌.. ఆమె స్థానంలో ఎవరంటే? | Know Reason Behind Why Patil Ruled Out Of Women’s T20 World Cup 2026, Prema Rawat Named Replacement | Sakshi
Sakshi News home page

Women T20 WC: గాయంతో శ్రేయాంక ఔట్‌.. ఆమె స్థానంలో ఎవరంటే?

Jun 19 2026 9:16 AM | Updated on Jun 19 2026 10:51 AM

Shreyanka Patil Ruled-Out-Prema Rawat Named Replacement-Women T20 WC

భారత క్రికెటర్‌ శ్రేయాంక పాటిల్‌ గాయంతో మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. కాగా శ్రేయాంక పాటిల్ స్థానంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ప్రేమా రావత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో రెండు వరుస విజయాలతో జోష్‌ మీదున్న హర్మన్ సేనకు శ్రేయాంక పాటిల్‌ గాయపడడం ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.

ఇక ప్రేమా రావత్‌కు అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం రానప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున డబ్ల్యూపీఎల్‌లో తన లెగ్-స్పిన్‌తో ఆకట్టుకుంది. అంతేకాకుండా, దేశీయ సర్క్యూట్‌లో ఉత్తరాఖండ్ తరఫున కూడా ప్రేమా రావత్ రాణించింది. అంతేకాదు ఆమె ఇండియా-ఎ తరఫున కూడా కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు నమోదు చేసి బీసీసీఐ దృష్టిలో పడింది.

కాగా టోర్నీలో భాగంగా బుధ‌వారం నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది. ఫీల్డింగ్ చేసే క్ర‌మంలో ఆమె కుడి కాలి మడమ తిరగబడింది. దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. 

దీంతో ఆమెను స్ట్రెచర్‌పై గ్రౌండ్ వెలుపలి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్కానింగ్‌ కోసం పాటిల్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా రిపోర్టులో శ్రేయాంక చీలమండకు గాయమైనట్లు తేలింది. ఆమె కోలుకునేందుకు కనీసం ఆరు వారాలు పట్టే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. 

దీంతో శ్రేయాంకను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ)కు రావాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. శిబిరంలోనే శ్రేయాంక పాటిల్‌ చికిత్స తీసుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే శ్రేయాంకకు గాయాలు కొత్తేమి కాదు. గతంలో వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా శ్రేయాంక దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది. డబ్ల్యూపీఎల్‌-2026 సీజన్‌తో ఆమె పునరాగమనం చేసింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. 

ఇప్పుడు వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీలో కూడా సత్తాచాటాలని భావించిన శ్రేయాంకకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇక పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై వరుసగా భారీ విజయాలు సాధించిన హర్మన్‌ సేన గ్రూప్-ఎ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement