అలా అయితే సచిన్‌ అత్యున్నత శిఖరాలకు చేరేవాడా?

Sachin Would Not Have Become Sachin If Batted At Sixth, Ganguly - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఒక శకాన్నే సృష్టించుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌, భారత దిగ్జజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అంత గొప్ప పేరు రావడానికి టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు రావడమేనని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. బ్యాటింగ్‌ సామర్థ్యం ఉన్న ఆటగాడ్ని టాపార్డర్‌లోనే పంపాలని, అలా చేస్తేనే అతను జట్టుకు ఉపయోగపడతాడన్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్‌ ధోనిని ఉద్దేశిస్తూ గంగూలీ ఇలా స్పందించాడు. ‘ ధోని ఒక గొప్ప క్రికెటర్‌. అతనొక భిన్నమైన క్రికెటర్‌. భారీ షాట్ల ఆడే సామర్థ్యం ధోని సొంతం. ఓసారి చాలెంజర్‌ ట్రోఫీలో నా జట్టు తరఫున ఆడి సెంచరీ సాధించాడు.  దాంతో అతని బ్యాటింగ్‌ సామర్థ్యం ఏమిటో నాకు తెలిసింది. దాంతో వైజాగ్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో స్థానంలో పంపా. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన సెంచరీ(148 పరుగులు) చేశాడు. (చదవండి: సురేశ్‌ రైనా.. దుబాయ్‌ లైఫ్‌)

ఆ తర్వాత ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం వచ్చిన ప‍్రతీసారి ధోని చాలా గొప్పగా ఆడాడు. బ్యాటింగ్‌ సామర్థ్యం ఉన్న ఆటగాడ్ని టాపార్డర్‌లోనే పంపాలి. సచిన్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి ఉంటే ఇన్ని రికార్డులు సాధించేవాడు.. ఇంతటి అత్యున్నత శిఖరాలకు చేరేవాడా. అతని ప్రతిభను అర్థం చేసుకుని బ్యాటింగ్‌ పొజిషన్‌ను సరిగ్గా వినియోగించుకుంటేనే జట్టుకు ఉపయోగపడుతుంది. నేను క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత ధోని టాపార్డర్‌లోనే ఆడితే బాగుండేది. అలా చేసి ఉంటే ధోని ఇంకా మెరుగైన రికార్డులు సాధించేవాడు. ఎక్కువ బంతులు ఆడే అవకాశం వస్తేనే ఎవరైనా బ్యాటింగ్‌లో సత్తాచాటుకునే అవకాశం ఉంటుంది. నేను క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత కూడా ధోనిని టాపార్డర్‌లో ఆడాలనే చెప్పా. ధోని బ్యాటింగ్‌ నిజంగా సూపర్‌. అతనొక అరుదైన క్రికెటర్‌’ అని స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడిన గంగూలీ.. ధోనిని కొనియాడాడు.(చదవండి: ‘ఇదేనా ధోనికిచ్చే గౌరవం’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top