IND vs WI: 'అతడికి రోహిత్‌ సపోర్ట్‌గా నిలిచాడు.. మ్యాచ్‌లో అదరగొట్టాడు'

Rohit gave him confidence and Avesh Khan bowled very cleverly - Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా యువ పేసర్‌ అవేష్‌ ఖాన్‌అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అవేష్‌ ఖాన్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అవేష్‌ ఖాన్‌ను భారత మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్ పటేల్‌ అభినందిచాడు. కాగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అవేష్‌ ఖాన్‌ దారుణంగా విఫలమైనప్పటికీ.. అతడికి మళ్లీ ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై పార్థివ్ పటేల్ ప్రశసంల వర్షం కురిపించాడు.

అవేష్‌ ఖాన్‌కు రోహిత్‌ శర్మ మద్దతుగా నిలవడంతోనే అతడు అద్భుతంగా రాణించడాని పటేల్‌ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో  పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. " ఈ మ్యాచ్‌లో అవేష్‌ ఖాన్‌ తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంటాడు. అతడు తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేస్తాడని నేను ముందే ఉహించాను. ఈ క్రెడిట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకి ఇవ్వాలి. ఎందుకంటే అతడు వరుసగా విఫలమవుతున్నా, మళ్లీ అవకాశం ఇచ్చి అవేష్‌లో ఆత్మవిశ్వాన్ని పెంచాడు.

రోహిత్‌ ఇచ్చిన భరోసాతో అవేష్‌ అద్భుతంగా రాణించాడు. క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్‌ చేసే తన సత్తాను అవేష్‌ ఖాను మరో సారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆటగాళ్లకు చాలా సపోర్టుగా ఉంటున్నారు. భారత జట్టులోకి వచ్చే ప్రతీ ఆటగాడు ఇటువంటి వాతావరణాన్నే కోరుకుంటారు" అని పేర్కొన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో 59 పరుగులతో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగులూండగానే 3-1తో టీమిండియా కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో పంత్‌(440, రోహిత్‌ శర్మ(33), సంజు సామ్సన్‌(30) పరుగులతో రాణించారు.

అనంతరం 192 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 19.1 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో పూరన్‌(24), పావెల్‌(24) పరుగులతో టాప​ స్కోరర్‌లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు , అవేష్‌ ఖాన్‌, రవి బిష్ణోయి, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య అఖరి టీ20 ఫ్లోరిడా వేదికగా ఆదివారం జరగనుంది.
చదవండి: Rohit Sharma: ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్‌.. ఇప్పుడు హీరో!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top