Asia Cup 2022: ఆసియా కప్‌ ఆడడంపై కోహ్లి కీలక నిర్ణయం!

Reports: Virat Kohli Informs Selectors Availability Upcoming Asia Cup - Sakshi

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ప్రస్తుతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. కోహ్లి సెంచరీ చేసి నాలుగేళ్లు కావొస్తుంది. ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి ఇప్పుడు అర్థ శతకం మార్క్‌ను కూడా అందుకోలేకపోతున్నాడు. తన ఫేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న కోహ్లి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్యన రెస్ట్‌ పేరుతో అతడిని దూరం పెడుతున్నప్పటికి పరోక్షంగా కోహ్లి క్రమక్రమంగా జట్టుకు దూరమవుతున్నాడని కొందరు పేర్కొన్నారు.

ఇటీవలే ఇంగ్లండ్‌తో వన్డే, టి20 సిరీస్‌ల్లో అంతగా ఆకట్టుకోని కోహ్లిని విండీస్‌తో వన్డే, టి20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇక కోహ్లిని జింబాబ్వే టూర్‌కు ఎంపికచేస్తారని అంతా భావించారు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లోనైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడని ఆశపడ్డారు. తాజాగా శనివారం ప్రకటించిన జింబాబ్వే టూర్‌కు కూడా కోహ్లి పేరును పరిగణలోకి తీసుకోలేదు. రెస్ట్‌ పేరుతో సీనియర్లందరిని పక్కనబెట్టినట్లు బీసీసీఐ పేర్కొన్నప్పటికి.. ఫామ్‌లో లేని కోహ్లికి రెస్ట్‌ ఎందుకన్న అభిప్రాయాలు వస్తున్నాయి. మరి ఆసియాకప్‌కైనా కోహ్లిని ఎంపిక చేస్తారా లేదా అని అనుమానాలు వస్తున్నాయి.

అయితే త్వరలో జరగనున్న ఆసియా కప్‌ ఆడడంపై కోహ్లి తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు సమాచారం. తాను ఆసియాకప్‌కు అందుబాటులో ఉండనున్నట్లు సెలెక్టర్లకు ఫోన్‌ ద్వారా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఒక అధికారి మాట్లాడుతూ..'' కోహ్లి సెలక్టర్లకు ఫోన్‌ చేసిన మాట నిజమే. ఆసియాకప్‌కు తాను అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు స్పష్టం చేశాడు. ఆసియా కప్‌ కోసం కొంతమంది ఆటగాళ్లకు రెస్ట్‌ పేరుతో విశ్రాంతినిస్తున్నాం. ఇక టి20 ప్రపంచకప్‌ వరకు టీమిండియా బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. అందుకే రొటేషన్‌ పాలసీ పేరుతో ఆటగాళ్లకు రెస్ట్‌ ఇస్తున్నాం'' అంటూ పేర్కొన్నాడు. 

ఇక ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు ఆసియాకప్‌ యూఏఈ వేదికగా జరగనుంది. మొదట శ్రీలంకలో ఆసియాకప్‌ను నిర్వహించాలని భావించినప్పటికి దేశ ఆర్థిక సంక్షోభం దృష్యా ఆసియా కప్‌ను యూఏఈకి తరలించినట్లు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) పేర్కొంది. మొత్తం ఆరుజట్లు ఉండగా.. రెండు గ్రూఫులుగా విభజించి మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

చదవండి: జింబాబ్వేలో పర్యటించే టీమిండియా ఇదే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top