Virat Kohli: విరాట్‌ కోహ్లికి ఊహించని షాక్‌! అయితే ధోని మాదిరి..

Reports: Kohli No Longer India Most Valuable Celebrity Decline In Brand Value - Sakshi

Virat Kohli- Ranveer Singh: భారత సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు విరాట్‌ కోహ్లి. అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రన్‌మెషీన్‌ పేరే ఓ బ్రాండ్‌ అనడంలో సందేహం లేదు. రికార్డుల రారాజు అయిన కింగ్‌ కోహ్లి.. బ్రాండ్‌ వాల్యూ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అయితే, తాజా నివేదికల ప్రకారం.. దేశంలోని మోస్ట్‌ వాల్యూబుల్‌ సెలబ్రిటీ ట్యాగ్‌ను కోహ్లి కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఈ స్థానాన్ని బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఆక్రమించినట్లు సమాచారం. కాగా గత ఐదేళ్లుగా కోహ్లి వరుసగా ఇండియా మోస్ట్‌ వాల్యూబుల్‌ సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు. అయితే, 2021 టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ వదిలేసిన కోహ్లిని.. ఆ తర్వాతి ఏడాదిలో వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం కోహ్లి టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు.

అగ్రస్థానంలో రణ్‌వీర్‌ సింగ్‌!
ఓ వైపు కెప్టెన్సీ చేజారడం.. అదే సమయంలో నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన కోహ్లి ఖాతాలో వెయ్యి రోజుల పాటు సెంచరీ అన్నదే లేకుండా పోయింది. ఈ పరిణామాలు కోహ్లి బ్రాండ్‌ వాల్యూపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో క్రోల్స్‌ సెలబ్రిటీ బ్రాండ్‌ వాల్యూయేషన్‌ రిపోర్టు 2022లో ఈ మేరకు రణ్‌వీర్‌ కోహ్లిని వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకువచ్చినట్లు పేర్కొంది.

పడిపోయిన బ్రాండ్‌ వాల్యూ
కోహ్లి బ్రాండ్‌ వాల్యూ 185.7 మిలియన్‌ డాలర్ల(2021లో) నుంచి గతేడాది 176.9 మిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు వెల్లడించింది. అదే సమయంలో 2021లో 158.3 మిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ వాల్యూ కలిగిన రణ్‌వీర్‌ సింగ్‌.. 2022లో 181.7 మిలియన్‌ డాలర్లతో టాప్‌లోకి దూసుకొచ్చినట్లు తెలిపింది.

త్వరలోనే మళ్లీ పూర్వవైభవం
అయితే, కోహ్లి బ్రాండ్‌ వాల్యూలో ఈ మేర పతనం తాత్కాలికమేనని.. త్వరలోనే అతడు పూర్వవైభవం పొందే అవకాశం ఉందని క్రోల్‌ వాల్యూయేషన్‌ సర్వీసెస్‌ ఎండీ అవిరల్‌ జైన్‌ మనీ కంట్రోల్‌తో వ్యాఖ్యానించారు. 34 ఏళ్ల కోహ్లి బ్రాండ్‌ వాల్యూ క్రికెటర్‌గా తారస్థాయికి చేరిందని.. త్వరలోనే నాన్‌- క్రికెటర్‌గానూ వాల్యూబుల్‌ సెలబ్రిటీగా అదే స్థాయికి చేరుకోగలడని పేర్కొన్నారు.


భార్య అనుష్క శర్మతో విరాట్‌ కోహ్లి

ధోని మాదిరి
సతీమణి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మతో కలిసి పలు బ్రాండ్లకు ఎండార్స్‌ చేస్తున్న కోహ్లి.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని మాదిరి నాన్‌- క్రికెటింగ్‌ విభాగంలోనూ సత్తా చాటగలడని జైన్‌ అభిప్రాయపడ్డారు. 2021లో కోహ్లి బ్రాండ్‌ వాల్యూలో 5 శాతం తరుగుదల నమోదైందని.. అయితే, ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా మరోసారి కోహ్లి మోస్ట్‌ వాల్యూబుల్‌ సెలబ్రిటీ హోదా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.

కింగ్‌ ఎల్లప్పుడూ
కాగా ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీతో సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి ఇటీవల ముగిసిన బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సందర్భంగా టెస్టుల్లోనూ శతక కరువు తీర్చుకున్నాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 75 సెంచరీలు బాదిన అతడు.. బ్యాటర్‌గా పూర్వవైభవం సాధించాడు. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి తిరిగి మోస్ట్‌ వాల్యూబుల్‌ సెలబ్రిటీ ట్యాగ్‌ పొంది రణ్‌వీర్‌ను వెనక్కినెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌-2023 టోర్నీ ఆరంభం ఆరోజే.. ఫైనల్‌ ఎక్కడంటే! హైదరాబాద్‌లోనూ..
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలనం.. ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా.. పాపం ముంబై!

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top