సెలెక్షన్‌ కమిటీని హఠాత్తుగా, సమాచారం ఇవ్వకుండా తొలగించడానికి కారణాలివే..!

Reasons For BCCI Sacking Selection Committee - Sakshi

చేతన్‌ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్‌ కమిటీకి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రద్దు చేసిన నేపథ్యంలో యావత్‌ భారత క్రికెట్‌ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. భారత క్రికెట్‌ చరిత్రలో జాతీయ సెలక్షన్‌ కమిటీని ఇలా హఠాత్తుగా తొలగించిన దాఖలాలు లేకపోవడంతో సర్వత్రా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది.

భారత క్రికెట్‌లో చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంపై అంతార్జతీయ క్రికెట్‌ సర్కిల్స్‌లో సైతం చర్చ జోరుగా సాగుతుంది. ఇంత ఆదరాబాదరాగా సెలెక్షన్‌ ప్యానెల్‌పై ఎందుకు వేటు వేయాల్సి వచ్చిందోనని నెటిజన్లు ఆరా తీసే పనిలో పడ్డారు. అయితే సెలెక్షన్‌ కమిటీపై వేటుకు గట్టి కారణాలే ఉన్నాయని బీసీసీఐ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

2021 జనవరిలో చేతన్‌ శర్మ నేతృత్వంలో సునీల్‌ జోషి(సౌత్‌ జోన్‌), హర్విందర్‌ సింగ్‌(సెంట్రల్‌ జోన్‌), దెబాషిశ్‌ మొహంతి(ఈస్ట్‌ జోన్‌)లతో కూడిన జాతీయ సెలెక్షన్‌ కమిటీ ఎన్నికైంది. నాటి నుంచి కమిటీ తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా, నాసిరకంగా ఉన్నాయని బీసీసీఐ వివరణ ఇచ్చింది. వీరి హయాంలో టీమిండియా.. 

  • 2021 టీ20 వరల్డ్‌కప్‌లో కనీసం నాకౌట్‌ స్టేజ్‌కు కూడా చేరలేదు
  • వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి
  • ఈ ఏడాది ఆసియా కప్‌లో సూపర్‌-4లోనే పరాభవం 
  • తాజాగా టీ20 వరల్డ్‌కప్‌-2022లో సెమీస్‌లోనే నిష్క్రమణ
  • బుమ్రా, జడేజా పూర్తి ఫిట్‌గా లేకపోయినా ఎంపిక చేయడం
  • ఏడాదికి 8 మంది కెప్టెన్లను మార్చడం
  • న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ పర్యటనలకు ఎం‍పిక చేసిన జట్లలో సమతూకం లోపించడం

ఇలా పై పేర్కొన్న అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ చేతన్‌ శర్మ టీమ్‌కు ఉద్వాసన పలికినట్లు వివరణ ఇచ్చింది. 

ఇదిలా ఉంటే, ఇదే నెలలోనే కొత్త సెలక్షన్‌ కమిటీని నియమించనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా వెల్లడించారు. సెలక్షన్‌ కమిటీలోని ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలని బీసీసీఐ పేర్కొంది. అలాగే, క్రికెట్‌కు కనీసం 5 ఏళ్ల క్రితం రిటైర్మెంట్‌ ప్రకటించి ఉండాలని స్పష్టం చేసింది.
చదవండి: బీసీసీఐ షాకింగ్‌ ప్రకటన.. సెలక్షన్‌ కమిటీ రద్దు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top