IPL 2023 RCB VS LSG: అమిత్‌ మిశ్రా తొండాట ఆడి కోహ్లిని ఔట్‌ చేశాడు..!

RCB VS LSG: Amit Mishra Seen Applying Saliva On Ball - Sakshi

ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్‌ 10) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ వికెట్‌ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ కీలక వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ వైరలవుతోంది. క్రికెట్‌ సర్కిల్స్‌లో ఈ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. నిన్నటి మ్యాచ్‌లో లక్నో స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా బంతిపై ఉమ్మిని రాస్తూ కనిపించాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్య నిషేధించబడింది. కోవిడ్‌ అనంతరం ఐసీసీ ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఉమ్మికి బదులు బంతిపై చమటను అప్లై చేసేందుకు ఐసీసీ పర్మిషన్‌ ఇచ్చింది. ఈ కారణంగానే అమిత్‌ మిశ్రా చర్యపై క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. మిశ్రా చర్యను మెజార్టీ శాతం తప్పుపడుతున్నారు. తెలిసి చేసినా, పొరపాటున చేసినా మిశ్రాపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు.

మిశ్రా బంతిపై ఉమ్మిని రుద్దిన ఓవర్లోనే (మూడో బంతికి) విరాట్‌ కోహ్లి ఔట్‌ కావడంతో.. రన్‌ మెషీన్‌ ఫ్యాన్స్‌ ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. మిశ్రా తొండాట ఆడాడని.. అలా చేయకపోయి ఉంటే కోహ్లి ఔటయ్యే వాడే కాదని వితండవాదానికి దిగుతున్నారు. ఉమ్మి అప్లై చేయడం వల్ల బంతి షైన్‌ అయ్యి కోహ్లి ఔట్‌ కావడానికి కారణమైందని కామెంట్స్‌ చేస్తున్నారు.

రూల్స్‌ ప్రకారం ఇలాంటి చర్యకు పాల్పడినందుకు మిశ్రా జట్టు లక్నోకు 5 పరుగుల పెనాల్టి విధించి ఆర్సీబీని విజేతగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ఐసీసీ నిషేధించింది కాబట్టి మిశ్రా అలా చేయడం తప్పని మరికొందరు అంటున్నారు. కాగా, 2021 ఐపీఎల్‌లోనూ మిశ్రా ఇలాంటి చర్యకే పాల్పడి అంపైర్‌ వార్నంగ్‌కు గురయ్యాడు. ఈ చర్య మరోసారి రిపీట్‌ చేస్తే పెనాల్టి విధిస్తానని అప్పుడు అంపైర్‌ మిశ్రాను గట్టిగా మందలించాడు.   

ఇదిలా ఉంటే, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్‌ (46 బంతుల్లో 79 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో స్టోయినిస్‌ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్‌ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోవడంతో లక్నో విజయం సాధించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top