source: X
భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి విజృంభించాడు. ఇవాళ ఢిల్లీతో మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 17.3 ఓవర్లలో కేవలం 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో 9 మొయిడిన్లు ఉన్నాయి. షమీతో పాటు ఆకాశ్‌దీప్ (17-0-74-2), ఆమిర్ గని (13-0-45-3), ముకేశ్ కుమార్ (17-2-43-1) కూడా చెలరేగడంతో ఢిల్లీని బెంగాల్ 240 పరుగులకే కుప్పకూల్చింది.
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్ ఆటగాడు హృతిక్ షోకీన్ (56) టాప్ స్కోరర్‌గా కాగా.. ఆయుశ్ దొసేజా (45), సర్థక్ రంజన్ (33), కెప్టెన్ ఆయుశ్ బదోని (23), దేవ్ లక్రా (18), దివిజ్ మెహ్రా (24), నవ్‌దీప్ సైనీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. సనత్ సాంగ్వాన్ (4), యశ్ ధుల్ (9) సింగిల్ డిజిట్ స్కోర్లకు ఔట్ కాగా.. అనూజ్ రావత్ డకౌటయ్యాడు. సిమర్జీత్ సింగ్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగియడంతో తొలి రోజు ఆట ఆక్కడే ముగిసింది.
కాగా, షమీ గతకొంతకాలంగా భారత జట్టులో రీఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు దేశవాలీ క్రికెట్‌లో అవకాశం వచ్చిన ప్రతిసారి సత్తా చాటుతున్నప్పటికీ.. భారత సెలెక్టర్లు కరుణించడం లేదు. కొద్ది రోజులు ఫిట్‌నెస్ అని.. మరికొద్ది రోజులు ఫామ్‌లో లేడని కుంటిసాకులు చెప్పిన సెలెక్టర్లు షమీ ఫిట్‌నెస్ నిరూపించుకుని, రాణిస్తున్నా అవకాశం ఇవ్వడం లేదు.
దీంతో షమీ విషయంలో వారు రాజకీయం చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే అతడికి అవకాశాలు ఇవ్వడం లేదని చర్చించుకుంటున్నారు. తాజాగా మరో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు న్యూజిలాండ్ సిరీస్‌కు అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు షమీని మాత్రం పట్టించుకోలేదు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున చివరిసారిగా ఆడిన షమీ.. ఆ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు తీసి సత్తా చాటడంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ మూడు వికెట్లు సాధించాడు.
అయితే, ఆ తర్వాత ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దాని తర్వాత జరిగిన దేశవాళీ సీజన్‌లో తిరిగి ఆకట్టుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు, రంజీ ట్రోఫీలో 13 ఇన్నింగ్స్‌ల్లో 37 వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఇదీ చదవండి: సెంచరీతో కదంతొక్కిన రింకూ సింగ్


