Ranji Trophy 2022: సూప‌ర్ సెంచ‌రీతో ఫాంలోకి వచ్చిన రహానే

Ranji Trophy 2022: Rahane Back In Form With Century - Sakshi

చాలా కాలంగా ఫాం లేమితో సతమతమవుటూ జట్టులో స్థానాన్నే ప్రశ్నర్ధకంగా మార్చుకున్న టీమిండియా మాజీ టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య ర‌హానే ఎట్ట‌కేల‌కు తిరిగి ఫాంను దొరకబుచ్చుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన మ్యాచ్‌లో సూప‌ర్ సెంచ‌రీ (250 బంతుల్లో 108; 14 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అద‌ర‌గొట్టి, వరుస వైఫల్యాలకు అడ్డుకట్ట వేశాడు. పృథ్వీ షా సారథ్యంలో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగిన రహానే.. నాలుగో స్థానంలో బరిలోకి దిగి అజేయమైన సెంచరీతో మెప్పించాడు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు.. ఆరంభంలోనే ఓపెనర్లు పృథ్వీ షా (1), ఆకర్షిత్ గోమెల్ (8) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రహానే ఆరంభంలో ఆచి తూచి ఆడినప్పటికీ, ఆతర్వాత గేర్ మార్చి ప‌రుగులు రాబ‌ట్టాడు. మరో ఎండ్ లో సర్ఫరాజ్ ఖాన్ (219 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సైతం సూపర్ సెంచరీతో రెచ్చిపోవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై జట్టు 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 

ఇదిలా ఉంటే, ర‌హానే తిరిగి టీమిండియాలో చోటు సంపాదించాలంటే రంజీ ట్రోఫీలో సత్తా చాటాల్సి ఉంటుంద‌ని బీసీసీఐ బాస్ గంగూలీ ఇది వ‌ర‌కే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రహానే ఇవాళ సాధించిన శతకంతో త్వరలో శ్రీలంక‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ లో చోటు సంపాదించడం ఖాయంగా తెలుస్తోంది. మరోవైపు ర‌హానే ఫాంలోకి రావ‌డంతో ఇటీవల అతన్ని ఐపీఎల్ వేలంలో దక్కించుకున్న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జట్టు సైతం ఆనందం వ్య‌క్తం చేస్తుంది. వేలంలో కేకేఆర్ ర‌హానేను కోటి రూపాయ‌ల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. 
చదవండి: IPL 2022: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top