T20 WC: పాక్‌ ఫైనల్‌ చేరగానే కొమ్ములొచ్చాయా?.. విషం చిమ్మిన రమీజ్‌ రాజా

Ramiz Raja Shocking Comments After India Exit-T20 World Cup 2022 - Sakshi

టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఫైనల్‌కు వెళ్లిందనగానే పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజాకు కొమ్ములొచ్చాయి. టీమిండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగకక్కాడు. పాకిస్తాన్‌ జట్టు ఫైనల్‌ వెళ్లినందుకు ప్రశంసలు కురిపించడం తప్పులేదు.. కానీ అదే సమయంలో పని గట్టుకొని టీమిండియాపై విషం చిమ్మడం ఎందుకంటూ క్రికెట్‌ అభిమానులు విమర్శలు చేశారు. 

టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకొని టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే సూపర్‌-12 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో పాక్‌ కథ ముగిసిందనుకున్నారు. కానీ అనూహ్యంగా నెదర్లాండ్స్‌ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో అదృష్టం కలిసి వచ్చి పాకిస్తాన్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే సెమీస్‌లో కివీస్‌పై మంచి ప్రదర్శన కనబరిచి మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అదే సమయంలో టీమిండియా ఇంగ్లండ్‌ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.

దీనిని అవకాశంగా తీసుకున్న పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజా టీమిండియా, బీసీసీఐను హేళన చేస్తూ మాట్లాడాడు. తమ టీమ్‌పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని.. అదే సమయంలో బిలియన్‌ డాలర్‌ ఇండస్ట్రీ టీమ్‌(టీమిండియా) ఇంటికెళ్లిపోయిందంటూ పేర్కొన్నాడు. 

"మా టీమ్‌పై మాకు అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి వరల్డ్‌ క్రికెట్‌ ఎంత వెనుకబడిపోయిందో పాకిస్థాన్‌ క్రికెట్‌ ఎంత ముందుకెళ్లిపోయిందో. ఈ వరల్డ్‌కప్‌లో అది తెలిపి వచ్చింది. టీమిండియా లాంటి బిలియన్‌ డాలర్‌ టీమ్స్‌ వెనుకబడిపోతే మా టీమ్‌ పైకెళ్లిపోయింది. అంటే కొన్ని విషయాలను మేము సరి చేస్తున్నామనే కదా అర్థం. గత నెలలోనే ముగ్గురు ప్లేయర్స్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా నిలిచారు. ఇది చాలు మేమేంటో చెప్పడానికి" అంటూ గొప్పలు చెప్పుకున్నాడు.

అయితే రమీజ్‌ రాజా వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానుల ధీటుగా బదులిచ్చారు. టీమిండియాపై విషం చిమ్మడం ఆపండి.. సందు దొరికితే చాలు టీమిండియాపై పడిపోతావు.. నీకు వేరే పని లేదనుకుంటా.. ఫైనల్‌కు వెళ్లగానే కాదు.. ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌కు మూడింది.. పాక్‌ను చావుకొట్టడం ఖాయం అంటూ రమీజ్‌ రాజాకు చురకలంటించారు. 

ఇక టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఆదివారం (నవంబర్‌ 13న) మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు మెల్‌బోర్న్‌లో 95 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా సెమీఫైనల్‌కు,ఫైనల్‌కు రిజర్వ్‌డేను ఐసీసీ కేటాయించింది. కాబట్టి ఒక వేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం‍ కలిగించి, ఆదివారం ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్‌ నిలిచిపోయిన దగ్గరి నుంచి రిజర్వ్‌ డే(సోమవారం)లో కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్‌ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top