వైభవ్‌ సూర్యవంశీ గాయంపై అధికారిక​ అప్‌డేట్‌ | Rajasthan Royals Issue Official Update On Vaibhav Sooryavanshi's Injury | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ గాయంపై అధికారిక​ అప్‌డేట్‌

Apr 26 2026 10:35 AM | Updated on Apr 26 2026 10:53 AM

Rajasthan Royals Issue Official Update On Vaibhav Sooryavanshi's Injury

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో వైభవ్‌ నొప్పితో విలవిల్లాడు. 

వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినా నొప్పి తగ్గలేదు. నడిచేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇదే మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉండిన వైభవ్‌ మైదానాన్ని వీడటంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

వైభవ్‌ గాయం చాలా తీవ్రమైందని, దీని దెబ్బకు సీజన్‌ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి రాయల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ చెక్‌ పెట్టాడు. వైభవ్‌ గాయం తీవ్రంగా లేదని మ్యాచ్‌ అనంతరం అధికారికంగా వెల్లడించాడు. దీంతో రాయల్స్‌ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

రాథోడ్‌ మాటల్లో.. "వైభవ్ హ్యామ్‌స్ట్రింగ్‌లో కొద్దిగా అసౌకర్యం అనిపించింది. అందుకు చికిత్స అందించారు. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. మరో రోజు లేదా రెండు రోజుల్లో పూర్తి స్థితి తెలుస్తుంది. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.

రాథోడ్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైభవ్‌ రాయల్స్‌ తదుపరి మ్యాచ్‌ సమయానికంతా సిద్దంగా ఉంటాడని తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల విశ్రాంతి తీసుకుంటే సరిపొతుందని స్పష్టమవుతుంది. రాయల్స్‌ తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 28న పంజాబ్‌ కింగ్స్‌తో ఆడనుంది. ఆ మ్యాచ్‌ సమయానికి వైభవ్‌ తప్పక అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఒకవేళ వైభవ్‌ ఆ మ్యాచ్‌ సమయానికి అందుబాటులో లేకపోతే రాయల్స్‌కు తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో వైభవ్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా తాను గాయపడిన మ్యాచ్‌లోనూ 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ పరాజయంపాలైంది. 

Advertisement
 
Advertisement
Advertisement