Quniton De Kock: ఫామ్‌లో లేడనుకున్నాం.. దుమ్మురేపుతున్నాడు; టార్గెట్‌ అదేనా?

Quinton de Kock 6th ODI Century VS India Ahead IPL 2022 Mega Auction - Sakshi

టీమిండియాతో మూడో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ సూపర్‌ సెంచరీతో  మెరిశాడు. వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు డికాక్‌ పెద్దగా ఫామ్‌లో కూడా లేడు. అంతకముందు జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన డికాక్‌ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. దీంతో వన్డే, టి20 క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు.

అయితే టీమిండియాతో వన్డే సిరీస్‌ మొదలవగానే డికాక్‌ జూలు విదిల్చాడు. తొలి మ్యాచ్‌లో 27 పరుగులు చేసిన డికాక్‌.. రెండో వన్డేలో 66 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక మూడో వన్డేలో టీమిండియాకు తన విశ్వరూపమే చూపెట్టాడు. 130 బంతుల్లో 124 పరుగులు చేసిన డికాక్‌ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో డికాక్‌ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..

►డికాక్‌కు వన్డేల్లో ఇది 17వ సెంచరీ. హషీమ్‌ ఆమ్లా(23 సెంచరీలు), హర్షలే గిబ్స్‌(18 సెంచరీలు) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. తాజా సెంచరీతో డికాక్‌ మూడో స్థానంలో నిలిచాడు.
►టీమిండియాపై డికాక్‌కు ఇది ఆరో సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు బాదిన విదేశీ ఆటగాడిగా డికాక్‌ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య( ఏడు సెంచరీలు) ఉన్నాడు.
►డికాక్‌ తాను సాధించిన 17వ సెంచరీతో.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్‌ కీపర్ల జాబితాలో రెండో స్థానానికి  ఎగబాకాడు. కుమార సంగక్కర 23 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. 
►టీమిండియాపై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఆరు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా డికాక్‌ నిలిచాడు. ఇంతకముందు సెహ్వాగ్‌ న్యూజిలాండ్‌పై 23 ఇన్నింగ్స్‌లో ఆరు సెంచరీలు సాధించాడు.
► టీమిండియాపై వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా డికాక్‌ రికార్డులకెక్కాడు.

ఐపీఎల్‌ మెగావేలంపై కన్నేసిన డికాక్‌..
అసలు ఫామ్‌లో లేని డికాక్‌ ఇప్పుడు మాత్రం దుమ్మురేపుతున్నాడు. తన ఇన్నింగ్స్‌లతో ఐపీఎల్‌ మెగా వేలంపై కన్నువేశాడు. ఇంతకముందు సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన డికాక్‌... ఇటీవలే తన పేరును రూ.2 కోట్లకు రిజిస్టర్‌ చేసుకున్నాడు. అతను ఉన్న ఫామ్‌ దృశ్యా వేలంలో మంచి ధరకే పలికే అవకాశం ఉంది. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్‌ మెగావేలం జరగనుంది. ఇక ఐపీఎల్‌ 2022 కోసం భారత ఆటగాళ్ల మొదలు అసోసియేట్‌ టీమ్‌ల క్రికెటర్ల వరకు అందరూ వేలంలో తామూ భాగం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేలంలో అవకాశం దక్కించుకునే క్రమంలో తొలి అడుగుగా ఏకంగా 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీయులు. ఇందులో గరిష్టంగా ఆస్ట్రేలియానుంచి 59 మంది క్రికెటర్లు ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top