PSL 2023: కిల్లర్‌ మిల్లర్‌ ఊచకోత.. పోలార్డ్‌ విధ్వంసం

PSL 2023: Multan Sultans Slams 190 Runs Vs Islamabad - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 19) ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సుల్తాన్స్‌.. కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్‌), రిలీ రొస్సో (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (25 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), పోలార్డ్‌ (21 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) శివాలెత్తడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఈ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్‌, రొస్సో ఓ మోస్తరుగా బ్యాట్‌ ఝులిపించగా.. మిల్లర్‌, పోలార్డ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిల్లర్‌ 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తే.. పోలార్డ్‌ చిన్న సైజ్‌ విధ్వంసమే సృష్టించాడు. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో మిల్లర్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో విరుచుకుపడితే.. ఇన్నింగ్స్‌ ఆఖరి మూడు బంతులను పోలీ బౌండరీలకు తరలించాడు. సుల్తాన్స్‌ ఇన్నింగ్స్‌లో మసూద్‌ (3) ఒక్కడే నిరాశపరిచాడు. ఇస్లామాబాద్‌ బౌలర్లలో రయీస్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌, షాదాబ్‌ ఖాన్‌, టామ్‌ కర్రన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్‌.. అబ్బాస్‌ అఫ్రిది (4/22), మహ్మద్‌ ఇలియాస్‌ (2/12), ఇహసానుల్లా (2/19), ఉసామా మిర్‌ (2/33) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 138 పరుగలకు ఆలౌటై, 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇస్లామాబాద్‌ ఇన్నింగ్స్‌లో డస్సెన్‌  (49) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. హసన్‌ (21), మున్రో (31), ఆజం ఖాన్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. 

ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ హవా కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో లాహోర్‌ ఖలందర్స్‌ చేతిలో ఓడిన ఈ జట్టు, ఆతర్వాత వరుసగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. సుల్తాన్స్‌ కెప్టెన్‌ రిజ్వాన్‌ ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు హాఫ్‌ సెంచరీలు సాధించి సూపర్‌ ఫామ్‌లో ఉండగా.. రిలీ రొస్సో 3 మ్యాచ్‌ల్లో రెండు మెరుపు హాఫ్‌ సెంచరీలతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌తో కిల్లర్‌ మిల్లర్‌ కూడా ఫామ్‌లోకి రావడంతో తదుపరి లీగ్‌లో ప్రత్యర్ధి బౌలర్లకు కష్టాలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. లీగ్‌లో ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్‌లో కరాచీ కింగ్స్‌, లాహోర్‌ ఖలందర్స్‌ తలపడనున్నాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top