రిల్టన్‌ కప్‌తో పాటు గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్న తమిళ కుర్రాడు

Pranesh M Dominates Rilton Cup, Becomes Indias 79th Grandmaster - Sakshi

స్టాక్‌హోమ్‌: తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ఎం.ప్రణేశ్‌ భారత 79వ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. స్టాక్‌హోమ్‌లో జరిగిన రిల్టన్‌ కప్‌లో విజేతగా నిలిచిన ప్రణేశ్‌ టైటిల్‌ గెలుచుకోవడంతో పాటు గ్రాండ్‌మాస్టర్‌ హోదా కూడా సాధించాడు. ఈ టోర్నీకి ముందే అతను మూడు జీఎం నార్మ్‌లు పొందగా, ఇప్పుడు 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లు (లైవ్‌) కూడా దాటాడు. ‘ఫిడే’ సర్క్యూట్‌లో తొలి టోర్నీ అయిన రిల్టన్‌ కప్‌లో ప్రణేశ్‌ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

136 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో ఆడిన 9 గేమ్‌లలో అతను 8 గెలిచి ఒకటి ఓడాడు. తెలంగాణకు చెందిన రాజా రిత్విక్‌ 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ప్రముఖ చెస్‌ కోచ్‌ ఆర్‌బీ రమేశ్‌ వద్ద ప్రణేశ్‌ శిక్షణ పొందుతున్నాడు. ‘అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్రణేశ్‌కు నా అభినందనలు. మంచి స్కోరుతో అతను విజేతగా నిలిచాడు. మన దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది’ అని దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ స్పందించారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top