ఒకే మ్యాచ్‌లో 529 పరుగులు.. 33 సిక్స్‌లు, 49 ఫోర్లతో | PL 2026: Runs rack up, catches go down, records tumble in PBKS vs DC Match | Sakshi
Sakshi News home page

PL 2026: ఒకే మ్యాచ్‌లో 529 పరుగులు.. 33 సిక్స్‌లు, 49 ఫోర్లతో

Apr 25 2026 10:02 PM | Updated on Apr 25 2026 10:02 PM

PL 2026: Runs rack up, catches go down, records tumble in PBKS vs DC Match

ఐపీఎల్‌-2026లో భాగంగా శ‌నివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అభిమానుల‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో మైదానంలో సంతోషం, ఉత్కంఠ‌, భ‌యం అన్నీ క‌న్పించాయి.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఐపీఎల్‌లో ఢిల్లీకి ఇదే అత్య‌ధిక స్కోర్‌. దీంతో ఢిల్లీ విజ‌యం ఖాయ‌మ‌ని అంతా భావించారు. కానీ యువ ఆట‌గాళ్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడుతూ ఢిల్లీపై ఒత్తిడి పెంచారు. 

అయితే ఓ వైపు పంజాబ్ ఓపెన‌ర్లు విధ్వంసం కొన‌సాగుతుండ‌గా.. మ‌రోవైపు మైదానం మొత్తం ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ బౌల‌ర్ లుంగి ఎంగిడీ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బంతిని అందుకునే క్ర‌మంలో ఎంగిడీ త‌ల‌కు బ‌ల‌మైన గాయమైంది. అంబులెన్స్‌లో అత‌డిని ఆస్ప‌త్రికి త‌రలించారు.

దీంతో మైదానంలో కాసేపు టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మ‌ళ్లీ మ్యాచ్ ప్రారంభ‌మ‌య్యాక పంజాబ్ విధ్వంసం కొన‌సాగింది. ఓపెన‌ర్లు ఔట‌య్యాక శ్రేయ‌స్ అయ్య‌ర్  (71 నాటౌట్‌; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఫ‌లితంగా ఢిల్లీ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది. టీ20 క్రికెట్‌లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్‌ తమ రికార్డును తామే బ్రేక్ చేసింది.

49 ఫోర్లు.. 33 సిక్స‌ర్లు.. 529 ర‌న్స్‌
మొత్తంగా ఈ మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర్షం కురిసింది. ఇరు జ‌ట్లు క‌లిపి మొత్తంగా 529 ప‌రుగులు చేశాయి. అదేవిధంగా పంజాబ్‌, ఢిల్లీ బ్యాట‌ర్లు క‌లిసి 49 ఫోర్లు, 33 సిక్సర్లు బాదారు. కాగా లెక్కలేనన్ని డ్రాప్ క్యాచ్‌లు ఈ మ్యాచ్ ఫ‌లితాన్ని నిర్ణ‌యించాయి. తొలుత కేఎల్ రాహుల్ క్యాచ్‌ను 12 ప‌రుగుల వ‌ద్ద శ‌శాంక్ సింగ్ విడిచిపెట్టాడు.

ఫ‌లితంగా రాహుల్ భారీ సెంచ‌రీతో కదం తొక్కాడు. ఆ త‌ర్వాత పంజాబ్ ఇన్నింగ్స్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇచ్చిన రెండు ఈజీ క్యాచ్‌ల‌ను క‌రుణ్ నాయ‌ర్ జార‌విడిచాడు. దీంతో అయ్య‌ర్ అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
చదవండి: IPL 2026: లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్‌ అప్‌డేట్‌
 

Advertisement
 
Advertisement
Advertisement