32 ఏళ్ల తర్వాత ఆసీస్‌ తొలిసారి; నాకు నమ్మకం ఉంది!

Pat Cummins Says Australian Batsmen Will Rediscover Their Touch - Sakshi

మెల్‌బోర్న్‌: ప్రతీ ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమని, తమ బ్యాట్స్‌మెన్‌ తిరిగి ఫాంలోకి వస్తారనే నమ్మకం ఉందని ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, సిడ్నీ టెస్టులో మెరుగ్గా రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఏడాది క్రితం తమ బ్యాటర్లు పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లను మట్టికరిపించారని, అదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు. కాగా బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా చేతిలో 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. పేలవ బ్యాటింగ్‌తో చతికిలపడి.. ఓ చెత్త రికార్డును నమోదు చేశారు. స్వదేశంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఒక్కరు కూడా కనీసం అర్ధ సెంచరీ చేయకపోవడం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముఖ్యంగా ఆసీస్‌ మాజీ కెప్టెన్‌, ఈ దశాబ్దపు టెస్టు ప్లేయర్‌(టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ది డికేడ్‌)గా నిలిచిన స్టీవ్‌ స్మిత్‌ రెండు టెస్టుల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. (చదవండి: రహానే అన్ని ప్రశంసలకు అర్హుడు: రవిశాస్త్రి)

ఈ నేపథ్యంలో ప్యాట్‌ కమిన్స్‌ మాట్లాడుతూ.. ‘‘మా టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. తిరిగి ఫాంలోకి వస్తారు. గత పన్నెండేళ్లుగా స్టీవ్‌ చాంపియన్‌గానే ఉన్నాడు. ప్రతీ ఆటగాడి జీవితంలో ఎత్తుపళ్లాలు ఉంటాయి. తను ఒక్కసారి నిలదొక్కుకుంటే చాలు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మేం ఆడింది కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఒక్క ఓటమికే కుంగిపోవాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక తమ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరితే మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నాడు. కాగా చివరిసారిగా 1988లో డిసెంబరు 24 నుంచి 29 వరకు ఎంసీజీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ అర్ధ సెంచరీ చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 285 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.(చదవండి: ఆసీస్‌కు ‘చాంపియన్‌షిప్‌’పాయింట్లు కోత)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top