15 బంతుల్లోనే అర్ధ సెంచరీ
మహిళల అంతర్జాతీయ టి20ల్లో కొత్త రికార్డు
కరాచీ: మహిళల అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదైంది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఈ కొత్త ఘనతను నమోదు చేసింది. శుక్రవారం జింబాబ్వేతో జరిగిన చివరి టి20లో ఫాతిమా 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. ఇందులో 10 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రికార్డు 18 బంతులతో ముగ్గురి పేరిట ఉంది. సోఫీ డివైన్ (న్యూజిలాండ్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా), రిచా ఘోష్ (భారత్) గతంలో ఈ ఫీట్‌ను సాధించారు. ఓవరాల్‌గా మహిళల టి20ల్లో కూడా ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ.
మేరీ కేలీ, లారా హారీస్ కూడా దేశవాళీ టి20ల్లో 15 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరారు. పాక్ తరఫున ఇప్పటి వరకు నిదా దార్ (20 బంతుల్లో) ఉన్న రికార్డును ఫాతిమా సవరించింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో చిగోరా ఓవర్లో 4 ఫోర్లు కొట్టిన ఫాతిమా...నోమ్‌వెలో ఓవర్లో వరుసగా 4, 4, 6, 6, 4 బాదడం విశేషం. ఫాతిమా సనా (19 బంతుల్లో 62 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో పాటు సాయేరా జబీన్ (50 నాటౌట్), ఆయేషా జఫర్ (45) కూడా రాణించడంతో మూడో టి20లో పాక్ 223 పరుగులు చేయగా, జింబాబ్వే 90 పరుగులకే కుప్పకూలింది. 133 పరుగులతో నెగ్గిన పాక్ 3–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఫాతిమా సనా సారథ్యంలోనే...
టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్తాన్ జట్టును శనివారం పీసీబీ ప్రకటించింది. ఐదుగురు ప్లేయర్లకు తొలిసారి వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కింది. 15 మంది సభ్యుల ఈ టీమ్‌కు ఫాతిమా సనా కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. 2024 టి20 వరల్డ్ కప్‌లో కూడా ఆమె సారథ్యంలోనే జట్టు బరిలోకి దిగింది. టి20 ప్రపంచకప్‌లో గ్రూప్ ‘ఎ’లో ఉన్న పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న భారత జట్టుతో బరి్మంగ్‌హామ్‌లో తలపడుతుంది. ఆ తర్వాత జూన్ 17న దక్షిణాఫ్రికాతో, 20న బంగ్లాదేశ్‌తో, 23న ఆ్రస్టేలియాతో, 27న నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్ ఆడుతుంది.
పాకిస్తాన్ టి20 జట్టు వివరాలు: ఫాతిమా సనా (కెప్టెన్), ఆలియా రియాజ్, ఆయేషా జఫర్, దియానా బేగ్, ఈమాన్ ఫాతిమా, గుల్ ఫెరోజా, ఇరమ్ జావేద్, మునీబా అలీ, నష్రా సుంధు, నటాలియా పర్వేజ్, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, సాయేరా జబీన్, తస్మియా రుబాబ్, తుబా హసన్.


