దిగ్గజాల సరసన చేరిన పాక్‌ వెటరన్‌ పేసర్‌ | Pakistan’s Unsung Hero Blanks Bangladesh, Joins Wasim Akram, Waqar Younis, And Mohammad Amir | Sakshi
Sakshi News home page

దిగ్గజాల సరసన చేరిన పాక్‌ వెటరన్‌ పేసర్‌

May 16 2026 6:49 PM | Updated on May 16 2026 7:16 PM

Pakistan’s Unsung Hero Blanks Bangladesh, Joins Wasim Akram, Waqar Younis, And Mohammad Amir

పాక్‌ వెటరన్‌ పేసర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ తన దేశ దిగ్గజ పేసర్లైన వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ సరసన చేరాడు. బంగ్లాదేశ్‌తో ఇవాళ (మే 16) మొదలైన రెండో టెస్ట్‌లో 3 వికెట్లు తీసిన అతడు.. విదేశీ గడ్డపై 100 టెస్ట్‌ వికెట్లు పూర్తి చేసుకున్న ఆరో పాకిస్తాన్‌ పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో వసీం అక్రమ్‌ (260) టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. వకార్‌ యూనిస్‌ (211), ఇమ్రాన్‌ ఖాన్‌ (199), మొహమ్మద్‌ ఆమిర్‌ (119), ఉమర్‌ గుల్‌ (111) మొహమ్మద్‌ అబ్బాస్‌ కంటే ముందున్నారు.

2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అబ్బాస్ ఇప్పటివరకు కేవలం 28 టెస్టులే ఆడినా, 51 ఇన్నింగ్స్‌ల్లో 109 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 22.84గా ఉండటం విశేషం. అందులో 100 వికెట్లు విదేశీ పిచ్‌లపైనే రావడం అతని విదేశీ ప్రదర్శన ఎంత ప్రభావవంతంగా ఉందో చూపిస్తోంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిల్హెట్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాక్‌ బౌలర్లు చెలరేగారు. అబ్బాస్‌తో (3 వికెట్లు) పాటు ఖుర్రమ్‌ షెహజాద్‌ (4), హసన్‌ అలీ (2), సాజిద్‌ ఖాన్‌ (1) సత్తా చాటారు. వీరి ధాటికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైంది. 

వాస్తవానికి బంగ్లాదేశ్‌ ఈపాటి స్కోర్‌ చేయడం కూడా చాలా గొప్పే. మిడిలార్డర్‌ బ్యాటర్‌ లిట్టన్‌ దాస్‌ (126) వీరోచిత శతకంతో బంగ్లాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. అతనికి మిగతా ఆటగాళ్ల నుంచి ఎలాంటి సహకారం లభించకపోయినా ఒంటరిపోరాటం చేశాడు.

తంజిద్‌ హసన్‌ (26), మొమినుల్‌ హక్‌ (22), కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో (23), తైజుల్‌ ఇస్లాం (16), ఫోరిఫుల్‌ ఇస్లాం (12 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్‌ హసన్‌ మిరాజ్‌ 4, తస్కిన్‌ అహ్మద్‌ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌, నహిద్‌ రాణా డకౌట్లయ్యారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అజాన్‌ అవైస్‌ 13, అబ్దుల్లా ఫజల్‌ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు పాక్‌ ఇంకా 257 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ పాక్‌పై 104 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement