PAK VS SA: Iftikhar Ahmed Hits Biggest Six Of T20 World Cup 2022, Video Goes Viral - Sakshi
Sakshi News home page

T20 WC 2022 PAK VS SA: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత భారీ సిక్సర్‌ బాదిన పాక్‌ బ్యాటర్‌

Published Thu, Nov 3 2022 5:11 PM

PAK VS SA: Iftikhar Ahmed Hits Biggest Six Of T20 World Cup 2022 - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో అత్యంత భారీ సిక్సర్‌ నమోదైంది. సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా సౌతాఫ్రికా-పాకిస్తాన్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 3) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ 106 మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డ్‌ అయ్యింది. ఎంగిడి వేసిన 16వ ఓవర్‌ నాలుగో బంతిని ఇఫ్తికార్‌ అహ్మద్‌.. డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి సాగనంపాడు. ఇఫ్తికార్‌ ఈ షాట్‌ ఆడిన విధానాన్ని చూసి బౌలర్‌ ఎంగిడి అవాక్కయ్యాడు. ఈ షాట్‌ తర్వాత సిడ్నీ స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతుంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌.. ఇఫ్తికార్‌ అహ్మద్‌ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. ఆరంభంలోనే వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. టెంబా బవుమా (19 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్సర్), ఎయిడెన్‌ మార్క్రమ్‌ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు) ధాటిగానే ఆడినా ఒకే ఒవర్‌లో వీరిద్దరూ ఔట్‌ కావడంతో సఫారీల కష్టాలు అధికమయ్యాయి. ఈ దశలో ఒక్కసారిగా భారీ వర్షం కూడా మొదలుకావడంతో దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది.

వర్షం మొదలయ్యే సమయానికి ఆ జట్టు స్కోర్‌ 9 ఓవర్ల తర్వాత 69/4గా ఉంది. సఫారీలు గెలవాలంటే 66 బంతుల్లో 117 పరుగులు చేయాల్సి ఉంది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (2), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారమయితే దక్షిణాఫ్రికా ఇంకా 15 పరుగులు వెనకపడి ఉంది. ఒకవేళ మ్యాచ్‌ సాధ్యపడకపోతే మాత్రం పాక్‌నే విజేతగా ప్రకటిస్తారు. 

వర్షం ఎడతెరిపినివ్వడంతో మళ్లీ మొదలైన మ్యాచ్‌.. సౌతాఫ్రికా టర్గెట్‌ ఎంతంటే..?
వర్షం ఎడతెరిపినివ్వడంతో పాక్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌ మళ్లీ మొదలైంది. అయితే మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుది​ంచి 142 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించారు. ఇప్పటికే ఆ జట్టు 9 ఓవర్లు ఆడేయడంతో మరో 5 ఓవర్లలో 73 పరుగులు సాధించాల్సి ఉంది. 

Advertisement
Advertisement