ఖలీల్ అహ్మద్‌తో కెప్టెన్ రుతురాజ్
గతేడాది కాలంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు కలిసి రావడం లేదు. ఐపీఎల్-2025లో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో చిట్టచివరగా పదో స్థానంలో నిలిచిన చెన్నై.. ఈ ఏడాది కూడా వైఫల్యాలు కొనసాగిస్తోంది.
గాయాల బెడద
ఇప్పటికి ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ సేన.. కేవలం రెండు మాత్రమే గెలిచి.. నాలుగు ఓడిపోయింది. మరోవైపు.. మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు గాయాల బెడద కూడా సీఎస్‌కేకు తలనొప్పిగా మారింది. దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఆయుశ్ దూరం
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఫామ్‌లో ఉన్న ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) గాయపడ్డాడు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడుతున్న సమయంలో ఆయుశ్ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ‘ఇది చాలా బాధాకరం. ఆయుశ్ చక్కటి ఫామ్‌లో ఉన్నాడు.
అతడు జట్టుకు దూరం కావడం చాలా ఇబ్బందికరం. అయితే గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. ఎప్పటిలోగా కోలుకుంటాడనేది ఇప్పుడే చెప్పలేం’ అని చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఇప్పటికే స్పష్టం చేశాడు.
ఇక ఆయుశ్ కంటే ముందు సీఎస్‌కే పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా గాయపడి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్‌తో అతడి స్థానం భర్తీ చేయాలని సీఎస్‌కే యాజమాన్యం తొలుత భావించినట్లు సమాచారం. ఇందుకోసం అతడిని ట్రయల్స్‌కు పిలిపించినట్లు తెలుస్తోంది.
అతడు కాదా!.. నిర్ణయం మార్చుకున్న CSK?
దీంతో ఆకాశ్ ఆగమనం ఫిక్సైపోయిందనే వార్తలు రాగా.. తాజా సమాచారం ప్రకారం తమ మాజీ బౌలర్ రాజవర్దన్ హంగర్గేకర్‌ను కూడా చెన్నై యాజమాన్యం ట్రయల్స్‌కు పిలిచినట్లు క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ కంటే కూడా రాజవర్దన్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ధోని కోలుకుంటున్నాడని.. అయితే, అతడు ఎప్పుడు బరిలోకి దిగుతాడనే విషయంపై తనకు కూడా స్పష్టత లేదని సీఎస్‌కే కోచ్ మైక్ హస్సీ పేర్కొనడం గమనార్హం.
చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్


