మమతా బెనర్జీకి టెన్షన్‌.. ఏడు లక్షల కొత్త ఓటర్లు చేరిక | 7 Lakh New Voters Added In West Bengal | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీకి టెన్షన్‌.. ఏడు లక్షల కొత్త ఓటర్లు చేరిక

Apr 20 2026 7:20 AM | Updated on Apr 20 2026 8:32 AM

7 Lakh New Voters Added In West Bengal

కోల్‌కతా: బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో సుమారు ఏడు లక్షల మంది కొత్త ఓటర్లను  ఎన్నికల సంఘం చేర్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇప్పుడు 6,82,51,008కి చేరింది. కాగా, ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు జాబితాలో  మరికొందరి పేర్లు చేరితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. 

కొత్త ఓటర్లలో సుమారు 3.22 లక్షల మంది మొదటి విడతలో, 3.88 లక్షల మంది రెండో విడతలో ఓటేయనున్నారు. వీరిలో తొలిసారి ఓటేస్తున్నవారు ఎందరు అనే వివరాలేవీ ఈసీ వెల్లడించలేదు. అవసరమైతే వాటిని తర్వాత పంచుకుంటామని పేర్కొంది. కాగా, కొత్త ఓటర్ల చేరికతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొత్త టెన్షన్‌ మొదలైనట్టు తెలిసింది. 

ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సమూలంగా మార్చేసింది. ఓటర్ల జాబితా నుంచి 90.83 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సర్‌ కారణంగా రాష్ట్రంలో ఓట్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు తగ్గింది. 2021 నాటి పరిస్థితులకు భిన్నంగా ఈసారి తృణమూల్, బీజేపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఓటర్ల జాబితాలో అత్యధిక కోతలు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఎల్లప్పుడూ సహకరించే మైనారిటీ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. తృణమూల్‌కు వెన్నెముకగా నిలిచే దక్షిణ ప్రాంతంలోనూ భారీగా కోతలు పడ్డాయి. అన్నిచోట్లా పరిస్థితి ఒకేలా లేదు. తృణమూల్‌కు బాగా బలమున్న దక్షిణ బెంగాల్‌లో ఇప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. ఉత్తర బెంగాల్, జంగల్‌ మహల్‌ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలుపుకొన్నట్లు కనిపిస్తున్నా మతువా ప్రాంతాల్లో ఓట్లు తగ్గడంతో కొంత ఇబ్బందిగానే కనిపిస్తోంది.

తృణమూల్‌కు సవాలే..
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ లెక్కలు.. మైనారిటీలు, మహిళలు, 24 పరగణాల జిల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఈ జిల్లాల్లో దెబ్బ పడటంతో కొన్ని డజన్ల నియోజకవర్గాల్లో బీజేపీ పోటీనిచ్చే అవకాశం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సర్‌కు ముందు రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 959 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. సర్‌ తర్వాత అది 950కి పడిపోయింది. దీంతో మమతకు అండగా నిలిచే మహిళల ఓట్లకు భారీగా కోతపడింది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోతతో వారిలో అభద్రతా భావం పెరిగింది. దీనివల్ల తృణమూల్‌వైపు ఓట్లు మరింత ఏకపక్షంగా మళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో మైనారిటీ ఓట్లద్వారా లబ్ధి పొందిన ఐఎస్‌ఎఫ్, ఏజేయూపీ, ఎంఐఎం నష్టపోయే అవకాశముంది.

నదియాలో విచారణలో ఉన్న ఓటర్లలో 78శాతం పేర్లను తొలగించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక తొలగింపు రేటు. 2011 నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఆయువుపట్టులా నిలిచిన జిల్లాలపై భారీగానే దెబ్బ పడింది. ఇందులో ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ముర్షీదాబాద్, నదియా, మాల్దా, హూగ్లీ, హావ్‌డా, ఉత్తర్‌ దినాజ్‌పుర్, పూర్వ బర్ధమాన్‌ ఉన్నాయి. ఈ జిల్లాల్లో 66.6 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. ఈ జిల్లాల్లోనే 178 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement