టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇరాన్ నౌకలపై దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. అమెరికా యుద్ధ నౌకలపైకి ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.
కాగా, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న ఓ నౌకను అమెరికా సీజ్ చేసింది. దిగ్భంధనాన్ని దాటినందుకు తౌస్కా అనే వాణిజ్య నౌకపై రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిపై పోస్టు చేసింది. ఓ నౌక ఇరాన్ పోర్టు వైపు ప్రయాణించబోతే తాము సీజ్ చేసినట్లు పేర్కొంది. దీంతో, ఈ చర్యకు ప్రతిస్పందించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అనంతరం, అమెరికా యుద్ధ నౌకల పైకి డ్రోన్లను ప్రయోగించింది. గల్ఫ్‌ఆఫ్ ఒమన్ నుంచి అమెరికా నౌకలను ఐఆర్‌జీసీ తరిమినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను సాయుధ పైరసీగా ఇరాన్ అభివర్ణించింది.
ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్‌కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో అసలు చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది.


